Road Accident in USA | మహబూబాబాద్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జాబ్ సెర్చ్ చేస్తున్నారు. త్వరలో మంచి జాబ్ తెచ్చుకుని వారి కాళ్లపై నిలబడతారని భావిస్తే.. తీవ్ర విషాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మేఘన, భావన తమ మరో ఆరుగురు స్నేహితులతో కలిసి మొత్తం ఎనిమిది మంది రెండు కార్లలో కాలిఫోర్నియా టూర్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్డులోని ఒక మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మేఘన, భావన మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంచి భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన తమ బిడ్డలు ఇకలేరన్న నిజాన్ని వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ యువతుల స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.