Pawan Vs Byreddy : జనసేన అధినతే పవన్ కల్యాణ్‌పై బీజేపీ సీనియర్ నేత, రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తనను పవన్ ముసలోడు అన్నారని.. తాను కొండారెడ్డి బురుజు వద్ద పవన్ తో కుస్తీకి నేను రెడీ అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన రాయలసీమ ఉద్యమకారులను పవన్ అవమానించారన్నారు. సీమ సెంటిమెంట్ పవన్ కు ఏం తెలుసు అని అన్నారు. తెలంగాణ విడిపోయి, సీమను రెండుగా చేయాలని చూస్తే.. ఇబ్బంది పడతావన్నారు. పవన్ సినిమాలు తీసుకుంటూ నోరెత్తలేదని.. ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కాావాలన్న బైరెడ్డిపై పవన్ ఫైర్
ఉదయం మంగళగరి పార్టీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించిన మాట్లాడిన పవన్ కల్యాణ్ .. రాష్ట్రంలో కొత్తగా వినిపిస్తున్న విభజన వాదంపై సీరియస్ కామెంట్స్ చేశారు. రాయలసీమ రాష్ట్రం ఇచ్చేయాలంటూ బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో వేర్పాటు వాద రాజకీయాలు చేస్తే తనలాంటి తీవ్రవాదిని మరోసారి చూడబోరన్నారు. పబ్లిక్ పాలసీని తెలియని మీరు రాష్ట్రాలు విడదీస్తానంటే తోలుతీసి కూర్బోబెడతానన్నారు. తమాషాలుగా ఉందా ఒక్కొక్కరికీ అన్నారు. సన్నాసులతో విసిగిపోయామన్నారు. మా నేలా అంటున్నారని, ఇది మా దేశం కాదా అన్నారు. రాయలసీమ గురించి మాట్లాడుతున్నారని, అక్కడి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, కర్నూలు నుంచి రాజధాని పోతుంటే ఎందుకు కాపాడుకోలేకపోయారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కోరుతున్న వారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇతర ప్రాంతాల వారు చనిపోయిన విషయం తెలుసా అని పవన్ ప్రశ్నించారు.
రాయలసీమ పరిరక్షణ పేరుతో ఉద్యమం చేస్తున్న బైరెడ్డి
బైరెడ్డి ప్రస్తావన తీసుకు వచ్చి .. పవన్ విమర్శలు చేయడంతో ఆయన స్పందించారు. బైరెడ్డి గతంలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అయితే ఎన్నికల్లో పెద్దగా ఓట్లు రాకపోవడంతో పార్టీని మూసేశారు. తర్వాత పలు పార్టీల్లో చేరారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోయినా... రాయలసీమ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తోందని అంటున్నారు. ఇటీవల కృష్ణా రివర్ మెనేజ్ మెంట్ బోర్డును ఏపీ ప్రభుత్వం విశాఖలో పెట్టాలని నిర్ణయించడంపై బైరెడ్డి మండి పడుతున్నారు.
కృష్ణా బోర్డును విశాఖలో వద్దని కర్నూాలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న బైరెడ్డి
కృష్ణాబోర్డును కర్నూలులో పెట్టాలని రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ధర్నాలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ హక్కుల కోసం మాత్రం ప్రత్యేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక రాయలసీమ వాదం వద్దంటూ పవన్ కల్యాణ్ చేసిన సీరియస్ కామెంట్స్ పై ఆయన ఫైరయ్యారు. వీరిద్దరి మధ్య వివాదం ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.
పవన్ లాంటి వ్యక్తుల్ని చూస్తుంటే రాజకీయాలపై విరక్తి వస్తుంది- మంత్రి బొత్స