Buggana :    ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినవన్నీ అక్షర సత్యాలే న‌ని  రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించలేదని వెల్ల‌డించారు.కేవలం విధానపరమైన అభ్యంతరాలనే కాగ్‌ వ్యక్తం చేసిందని ఆయ‌న పేర్కొన్నారు. విధానపరమైన జాప్యాలకు హడావుడిగా ప్రైవేటు వ్యక్తి సారథ్యంలో స్థాపించిన సీఎఫ్‌ఎంఎస్‌ కారణం కాదా అని టీడీపీ నేత‌ల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ సంస్థలకు స్థానిక సంస్థలు కట్టాల్సిన బకాయీలను చెల్లించడం తప్పంటారా అని ఆయ‌న ప్రశ్నించారు.  రాష్ట్ర విభజన, టీడీపీ ఆర్థిక అస్తవ్యస్త పాలన, కోవిడ్‌ మహామ్మారి వంటి కారణాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నదని తెలిపారు. 


పరిస్థితిని చక్కదిద్దుతున్నాం ! 


ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ చేస్తూ  పరిస్థితిని చక్కదిద్దుతూ వస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో వాస్తవాలను పూస గుచ్చినట్లు వివరించారని ఆయ‌న తెలిపారు. గత టీడీపీ పాలనలో జరిగిందేమిటో,గత మూడున్నర ఏళ్ల కాలంలో వైసీపీ పరిపాలనలో ఆర్థిక నిర్వహణ ఎలా జరిగిందో సీఎం రాష్ట్ర ప్రజలందరికీ వివరించారని చెప్పారు. కాగ్‌ తన నివేదికలో 2020–21 సంవత్సరపు ఆర్థిక పరిస్థితిపైనా, అంతకు ముందు 2015–16 నుంచి 2020–21 సంబంధించిన ఆర్థిక అంశాలపైనా వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు.కాగ్‌ తన నివేదికలో పొందు పర్చిన అంశాల్లో తొలి నాలుగేళ్ల టీడీపీ పరిపాలనలోని ఆర్థిక వ్యవహారాలపైనే అనే విషయం గ్రహించాలన్నారు. ఈ నివేదికలో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు ఉన్నాయని, టీడీపీ పాలనలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ 17,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టిందని వివ‌రించారు. 


ప్రత్యేక బిల్లులతో లావాదేవీలు జరగవు ! 


టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను ఒక కారణంగా చూపి, ఇపుడు వైసీపీ పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించిందని అన్నారు. కాగ్‌ నివేదికలో పొందు పర్చిన ప్రత్యేక బిల్లుల అంశం 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందేన‌ని, ఈ ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌ ప్రభావం  ప్రజలకు బాగా తెలుసని, ఈ నివేదికలో ప్రధానంగా పేర్కొన్న అంశం లావాదేవీల సర్దుబాట్లకు సంబంధించిన అంశమేన‌ని అన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ రిపోర్టింగ్‌ విధానంలో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లను గుర్తించడం కోసం మాత్రమే ప్రత్యేక బిల్లులు అని పేరు పెట్టడం జరిగిందని, ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరుగవని యనమల  కి బాగా తెలుస‌ని,అయితే దురుద్దేశ్యంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, గందరగోళ పరిచేందుకు లేని పోని అభాండాలు వేస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2018–19లో ఇదే విధంగా 98,049 బుక్‌ అడ్జస్ట్‌మెంట్స్‌ ట్రాన్సాక్షన్లను ప్రత్యేక బిల్లులుగా చూపించిన విషయాన్ని మర్చిపోయారా అని య‌న‌మ‌ల‌ను బుగ్గన ప్ర‌శ్నించారు. 


లావాదేవీల నిబద్ధతను కాగ్ ప్రశ్నించలేదు ! 


వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించలేద‌ని, కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే వారు అభ్యంతరం లేవ నెత్తారని, ఈ సమస్యలన్నీ కూడా సీఎఫ్‌ఎంస్‌ వ్యవస్థను పటిష్టంగా రూపొందించక పోవడం వల్లనే తలెత్తాయన్నారు. ఈ ప్రత్యేక బిల్లుల ప్రక్రియ సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థలో ఉత్పన్నమైన ప్రాథమిక లోపాల వల్లనే  2020–21లో వినియోగించడం జరిగిందని, దానిని సరిదిద్ది ,గత 9 నెలలుగా కాగ్‌ సలహాల మేరకు స్పెషల్‌ బిల్లుల విధానం అనేది లేకుండా ‘నిల్‌ అడ్జస్ట్‌మెంట్‌ బిల్లుల’ పద్ధతిలో  జమాఖర్చుల నిర్వహణ జరుగుతోందని బుగ్గ‌న క్లారిటి ఇచ్చారు. రూ 9,124.57 కోట్లకు సంబంధించిన  16,688  బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లు జరిగాయని, ఈ ఎంట్రీలు ఎందుకు చేయాల్సి వచ్చిందో యనమల  కాగ్‌ నివేదిక సాకుగా చేసుకుని రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. అయితే కాగ్‌కు ఈ విషయం పై వివరణ ఇచ్చామ‌ని అన్నారు. కాగ్‌ నివేదికలో రూ 8,891.33 కోట్లు శాంక్షన్‌ ఆర్డర్స్‌ లేకుండా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి డెబిట్‌ అయ్యాయన‌టంలో అర్దం లేద‌ని బుగ్గ‌న కొట్టిపారేశారు.