Yuvagalam Padayatra: నారా లోకేష్ (Nara Lokesh)  చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam  Padayatra) చారిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. తుని (Tuni Constituency) నియోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో సోమవారం యువ‌గ‌ళం పాద‌యాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా పేద‌ల ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్ల (Anna Canteens)ను కొనసాగిస్తామని హామీ ఇస్తూ తేటగుంట (Tetagunta) యనమల అతిధిగృహం వద్ద శిలాఫ‌ల‌కాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పాల్గొని లోకేష్‌తో కలిసి పాదయాత్రలో చేశారు. 



అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం
శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మిస్తూ పాదయాత్ర సాగుతోంది. ప్రజ‌లే సైన్యంగా యువ‌గ‌ళం పాద‌యాత్ర 3000 కి.మీ. మైలురాయికి చేరింది. తుని నియోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో ఈ మ‌జిలీకి గుర్తుగా వైసీపీ స‌ర్కారు మూసేసిన పేద‌ల ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్లు మ‌ళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫ‌ల‌కం ఆవిష్కరించాను’ అని అన్నారు.


పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  


నేడు విశాఖలోకి ఎంట్రీ
ఉభయగోదావరి జిల్లాల్లో 23రోజుల పాటు 404 కి.మీ.ల మేర కొనసాగగా, సోమవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఉభయగోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తలు యువనేతకు వీడ్కోలు పలకనుండగా, యువనేతకు భారీ స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.


కుప్పంలో ప్రారంభం
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జనవరి 27న లోకేష్ 'యువగళం' పాదయాత్ర తొలి అడుగు పడింది. ఫిబ్రవరి 6 తేదీ 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద మార్చి 9న 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఏప్రిల్ 21న కర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద వెయ్యి కిలో మీటర్ల మైలు రాయిని లోకేష్ దాటారు. కేవలం 77వ రోజుల్లో లోకేష్ వెయ్యి కిలోమీటర్లు నడిచారు.


కడపలో జూన్ 6వ తేదీ లోకేష్ 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కడపలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థకు అలంఖాన్ పల్లె శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. జులై 11న కావలి నియోజకవర్గంలో 153వ రోజు లోకేష్ 2000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఆగస్టు 19న 2500 కిలోమీటర్ల మైలు రాయిని పూర్తి చేసుకున్నారు. 


తరువాత సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. అప్పటి వరకు నారా లోకేష్ మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208 రోజులు సాగిన పాదయాత్ర రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద ఆగి పోయింది. తరువాత చంద్రబాబుకు బెయిల్ లభించడం, ఆయన ప్రజల్లోకి రావడంతో నవంబర్ 27న లోకేష్ తన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.


పాదయాత్రలో లోకేష్ అధికార వైసీపీపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అలాగే వైసీపీ నేతల అవినీతిని నిలదీస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్నివిధాలుగా వెనకబడిందని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్నది నిశ్శబ్ధ విప్లవమని, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమంటూ విమర్శలు చేస్తున్నారు.


3000 కిలోమీటర్ల పాదయాత్ర సాగిందిలా..



  • 2023 జనవరి 27 పాదయాత్ర ప్రారంభం

  • ఫిబ్రవరి 6న  పూతలపట్టు నియోజకవర్గం 100 కిలోమీటర్లు

  • మార్చి 9 మదనపల్లె నియోజకవర్గం 500 కిలోమీటర్లు

  • ఏప్రిల్ 21 ఆదోని నియోజకవర్గం 1000 కిలోమీటర్లు

  • జూన్ 6 కడప నియోజకవర్గం 1500 కిలోమీటర్లు

  • జులై 11 కావలి నియోజకవర్గం 2000 కిలోమీటర్లు

  • ఆగస్టు 19 మంగళగిరి నియోజకవర్గం 2500 కిలోమీటర్లు

  • డిసెంబర్ 11 తుని నియోజకవర్గం 3000 కిలోమీటర్లు