BPCL will set up a huge plant in Machilipatnam : భారత్  పెట్రోలియం కార్పొరేషన్ సీఎండీ కృష్ణకుమార్ తో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఏపీలో రూ. అరవై వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న రిఫైనరీపై చర్చించారు.  రిఫైనరీ పెట్టడానికి బీపీసీఎల్ మూడు రాష్ట్రాలను పరిశీలించింది. ఇటీవల  ఢిల్లీ పర్యటనలో పెట్రోలియం మంత్రిని కలిసిన చంద్రబాబు ఏపీలో ప్లాంట్ పెట్టాలని కోరారు. ఈ మేరకు కేంద్రం ఏపీలో ఈ ప్లాంట్ ను పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ అంశంపై చర్చించేందుకు బీపీసీఎల్ సీఎండీతో పాటు ఇతర అధికారులు అమరావతికి వచ్చారు. చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రిఫైనరీ పెట్టడానికి అవసరమయ్యే భూమి, మౌలిక సదుపాయాలు ఇతర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. 


 





 


25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్న ఎంపీ బాలశౌరి


రిఫైనరీ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు వచ్చిన బీపీసీఎల్ ఉన్నతాధికారుల్ని ఎంపీ బాలశౌరి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి తీసుకెళ్లారు.  రా ష్ట్రంలో  రిఫైనరీ   ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని బాలశౌరి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.  రిఫైనరీ ఏర్పాటైతే సుమారు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.రాష్ట్రానికి భారీ పెట్టుబడి రానుండడం శుభసూచకమని.. పవన్ కల్యాణ్, ఎన్డీయే ఎంపీల చొరవతో బీపీసీఎల్ రాష్ట్రం వైపు ఆసక్తి చూపిస్తోందన్నారు. 


 





 


విభజన చట్టంలో రిఫైనరీ అంశం


ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్‌ 93(4) ప్రకారం ఏపీలో పెట్రోలియం రిఫైనరీని ఏర్పాటును పరిశీలించాలని ఉంది. ఈ మేరకు ఇప్పుడు ఏపీకి అవకాశం లభిస్తోంది.  కేంద్ర బడ్జెట్‌లో  అధికారిక  ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ రిఫైనరీ కోసం మచిలీపట్నంలో సుమారు 3 వేల ఎకరాల భూమి అవసరం. ఈ భూమిని  రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి ఇవ్వాల్సి ఉంటుంది. పోర్టు కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున భూములు సేకరించారు. ఇండస్ట్రీలకు కేటాయించడానికి వాటిని సేకరించారు. అందులో భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది.  బీపీసీఎల్‌ సంస్థకు ప్రస్తుతం ముంబై   , కొచ్చి  ,  మధ్యప్రదేశ్‌ ల్లో మూడు రిఫైనరీలున్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 36 ఎంఎంటీపీఏ.   నాలుగో రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. 


 





 


మచిలీపట్నానికి మహర్దశ


రిఫైనరీ నిర్మాణం  పూర్తయితే మచిలీపట్నానికి మహర్దశ పడుతుంది. పెద్ద ఎత్తున పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఉద్యోగాలతో పాటు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ ప్లాంట్  వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటున్నారు.