Ukraine President Slams PM Modi Russia Visit: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ముగిసింది. అక్కడి నుంచి ఆస్ట్రియాకి వెళ్లారు. అయితే..మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర అసహనం (Russia Ukraine War) వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దారుణంగా దాడులు చేసి ప్రజల ప్రాణాలు తీస్తోంటే మోదీ మాత్రం పుతిన్‌తో అంత సన్నిహితంగా ఎలా ఉంటారంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పుతిన్‌ని కౌగిలించుకోవడంపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఇంటి టెరస్‌పై ప్రధాని మోదీ ఆతిథ్యం ఇచ్చారు పుతిన్‌. ఇద్దరూ కలిసి టీ తాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ, పుతిన్ హగ్ చేసుకున్న ఫొటో వైరల్ అయింది.





ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో రష్యా దాడికి సంబంధించిన కొన్ని ఫొటోలనూ షేర్ చేశారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌లో ఓ హాస్పిటల్‌పై బాంబు దాడి చేయగా బాధితులందరినీ వేరే చోటకు తరలించారు. వాళ్లలో కొంత మంది చిన్నారులూ ఉన్నారు. ఆంబులెన్స్‌లలో వాళ్లని తరలిస్తున్న ఫొటోలని షేర్ చేశారు జెలెన్‌స్కీ. ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఏమైనా చొరవ చూపిస్తారనుకుంటే ఇద్దరూ ఆ ప్రస్తావనే తీసుకురాలేదని మండి పడ్డారు. రెండేళ్లు దాటినా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. ఇరువైపులా భారీ నష్టం వాటిల్లుతోంది. 


"రష్యా చేసిన దాడిలో ఇవాళ ఉక్రెయిన్‌లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో చిన్నారులూ ఉన్నారు. 170 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని అతి పెద్ద పిల్లల ఆసుపత్రిపై దాడి జరిగింది. వీళ్లలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్న వాళ్లున్నారు. చాలా మంది చిన్నారులు శిథిలాల కిందే ఊపిరాడక చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం దిశగా ఏదైనా చర్చలు జరుగుతాయనుకున్నాం. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత ఇలా పుతిన్‌ని కౌగిలించుకుని సన్నిహితంగా ఉండడం నన్నెంతో అసహనానికి గురి చేసింది"


- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు 






Also Read: Gender Change: ఐఆర్‌ఎస్‌ అధికారి అనసూయలా ఎవరైనా జెండర్ మార్చుకోవచ్చా, సుప్రీం కోర్టు ఏం చెప్పింది?