AP Employees: మా డబ్బులూ వాడేశారు, మీ దయతో మాకు ఉద్యోగాలొచ్చాయా? సమ్మెకు రెడీ - బొప్పరాజు

దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పెన్షన్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నారని బొప్పరాజు విమర్శించారు.

Continues below advertisement

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వారు పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 5 లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉద్యోగులకు జీతభత్యాలు సకాలంలో రావడం లేదని, ఈ విషయం ప్రజలకు తెలియాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 
కర్నూలులో నిర్వహించే ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం ఆయన అనంతపురంలో నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు.

Continues below advertisement

అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల దయ దక్షిణ్యాలతో తాము ప్రభుత్వ ఉద్యోగాలకు సంపాదించుకోలేదని అన్నారు. తాము కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నామని అన్నారు. చట్టపరంగా తమకు రావాల్సిన జీతభత్యాలు సమయానికి రావడం లేదని ముఖ్యమంత్రి చెప్పామని అన్నారు. అయినా ఇవ్వక పోవడంతో ఇలా రోడ్డున పడ్డామని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. 

ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే దుస్థితికి ప్రభుత్వం చేరుకుందని విమర్శించారు. ఆఖరికి తాము దాచుకున్న డబ్బులు అడుగుతున్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ సమాచారం ఇచ్చినా ఇప్పటికీ డిపార్టుమెంట్‌లకు పంపలేదని అన్నారు. ఇక టిఏ (TA), డిఏ (DA)ల ధ్యాస లేదని వాటిని ఎప్పుడో తీసివేశారని వివరించారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పెన్షన్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నారని బొప్పరాజు విమర్శించారు. కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మూడేళ్లుగా కమిటీలు తప్ప ఫలితం లేదన్నారు.

తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు. తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న దాంట్లో నిజంలేదని, ఉద్యమం చేయాల్సి వస్తే అందరం కలిసి పోరాడతామని చెప్పారు. 

‘‘గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారు. ఒకటో తేదీకల్లా జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చింది. చట్టప్రకారం మాకు రావాల్సినవి కూడా ఇవ్వట్లేదు. మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోంది. కొత్త జీవోల ఊసే లేకుండా పోయింది. సీపీఎస్‌ రద్దు చేస్తామని అన్నారు. ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఎవరికీ మినిమం టైమ్‌ స్కేల్‌ ఇవ్వట్లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ అలవెన్సులేమీ ఇవ్వలేదు. ఒప్పంద ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదు. ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకూ లేదు. కరోనా బారినపడి వందల మంది చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్‌లు చెల్లించట్లేదు’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ లో వివరించారు.

Continues below advertisement
Sponsored Links by Taboola