Bopparaju :  రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందన్న ప్రభుత్వ వాదనపై ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్త చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి  చెప్పడం దారుణమని  బొప్పరాజు వెంకటేశ్వర్లు   విమర్శించారు. మంగళవారం ఆయన కాకినాడ లో  ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు.  వాలంటీర్ల జీతాలతో పాటు ఏపీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.                                       
  
ఇప్పటికైనా ఉద్యోగులందరూ నిర్లక్ష్యం వహించకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచు కోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపిచ్చారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే జీతాలు సరైన సమయానికి పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 28న రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నామని, అందరూ హాజరు కావాలని కోరారు.                


ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు.  ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యమం తీవ్రమైతే తాము బాధ్యులం కాదని అన్నారు.  డిమాండ్ల పరిష్కారానికి 47 రోజులుగా నిరసనలు తెలుపుతున్నామని బొప్పరాజు వివరించారు. రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యామని, కానీ సమావేశాలతో ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఉద్యమ నేపథ్యంలో, ఈ నెల 28న ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం అవుతున్నట్టు బొప్పరాజు వెల్లడించారు.  పీఆర్సీ, డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, పాత బకాయిలు ఎన్నేళ్లకు ఇస్తారో తెలియడంలేదని బొప్పరాజు వాపోతున్నారు.          


ఈ నెల 28 నుంచి కార్మిక, టీచర్స్, సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని బొప్పరాజు చెబుతున్నారు.  తాము చాలా ఓపికతో సహనంతో ఉద్యమాన్ని చేస్తున్నామన్నారు. తెలంగాణాలో ఒక్క డీఏ పెండింగ్‌లో లేదని, కానీ ఏపీ లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీఏ ఊసే లేదన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై సమస్యలు పెంచే కొద్ది పెరుగుతూనే ఉంటాయని పరిష్కారం కావాలని ఆనయంటున్నారు.