BJP On Polavaram: పోలవరం వ్యవహరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి , పోలవరం కావాలి అనే నినాదాన్ని బీజేపి ప్రచారంలోకి తేనుంది.


పోలవరంపై రగడ...
పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసే విషయంలో రాజకీయ విమర్శలు, తారాస్థాయికి చేరుతోంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలవరం పనులు పూర్తి చేయటంలో నిర్లక్ష్యంగా ఉందని, తెలుగుదేశం ఆరోపిస్తుంటే, పోలవరంపై అటు బీజేపీ కూడా విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికేసిందనే సామెత పోలవరం విషయంలో రెండు పార్టీల తీరు ఉందని, బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.  ప్రాంతీయ పార్టీల దురాశకు జాతీయ ప్రాజెక్టు పోలవరం దుస్థితే సాక్ష్యమని ఆయన విమర్శించారు. కేంద్రం పై నింధలు వేయటం మినహా రెండు పార్టిలు తమ హయాంలో చేసిందేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కడితే రీయింబర్స్ చేయనని కేంద్రం చెప్పిందా అని విష్ణు వర్దన్ రెడ్డి ప్రశ్నించారు. 
దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం కేంద్ర నిధులతో నిర్మాణం చేస్తున్న జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. కేంద్రం ప్రతీ పైసా ఇస్తాం నిర్మించుకోండని భరోసా ఇస్తే 2014-19 వరకూ టీడీపీ ప్రభుత్వం చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. ఆ నాటి ప్రభుత్వానికి పని తక్కువ- పబ్లిసిటీ రాజకీయం ఎక్కువ అయ్యిందని విమర్శించారు. 2018 కల్లా పూర్తి చేస్తామన్నారు మధ్యలో కాంట్రాక్టర్లను మార్చి సమయాన్ని వృధా చేశారని అన్నారు. అడిగినన్ని నిధులు రీఎంబర్స్ చేసినా  పూర్తి చేయలేకపోయారని తెలిపారు.


వైఎస్ఆర్ సీపీ సైతం అంతే...
తెలుగు దేశం పార్టీకి  చేత కాదని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే, అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా పరిస్దితులు మారాయని విష్ణు వర్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అరకొరగా జరుగుతున్న పనుల్ని కూడా రివర్స్ టెండర్ పేరుతో జగన్ సర్కార్ రివర్స్ చేసిందని  అన్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులో పనులు జరగకపోగా, చేసిన పనుల్నే మళ్లీ చేయాల్సి వస్తోందని తెలిపారు. డయాఫ్రం వాల్,  గైడ్ బండ్ ను ఎం చేస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చెప్పిన సలహాలు వినకుండా ఇష్టారాజ్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ జీవనాడితో ఆటాడుకున్నారని మండిపడ్డారు. ఎలా చూసినా  రెండు ప్రభుత్వాలు  అహంతో తీసుకున్న నిర్ణయాలే పోలవరానికి శాపమయ్యాయని తెలిపారు. నిధులన్నీ కేంద్రం ఇస్తుందని చట్టంలో ఉంటే నిర్మించుకోవడం చేతకాని అసమర్థ ప్రభుత్వాలను ప్రజలు చేశారని అన్నారు. కేంద్రం పై నిందలేసి పోలవరం భారం దించేసుకోవడానికే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదికారం ఇవ్వలేని అన్నారు. అధికారం ఉన్నా ప్రాజెక్టు పూర్తి చేయకుండా విపక్షాలు పై రాజకీయ విమర్శలు చేయడం జగన్ సర్కార్ వైఫల్యంగా అభివర్ణించారు. 


ఎన్డీఏ రావాలి... పోలవరం కావాలి...
ఈ క్రమంలో ప్రధాన పార్టిల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి, పోలవరం ప్రాజెక్ట్ ను సాధించుకునే దిశగా బీజేపీ అడుగు వేస్తుందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, పోలవరం కావాలి అనే నిధాదంతో పని చేస్తామని విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.