పేకాట.. ఒక రోజు ఆడితే రాజులు అదృష్టం వరిస్తే రారాజు అవ్వొచ్చు. అడ్డం తిరిగితే అడుక్కునే వారు అవ్వొచ్చు. రాత్రికి రాత్రి కోట్లు సంపాదించి పెద్ద వారు అయిపోవడానికి కొన్ని చోట్ల ఈ జూదం జరిగితే మరికొన్ని చోట్ల కొందరికి టైంపాస్ గేమ్. ఇందులోనూ పురుషులకు దీటుగా తాము ఏమాత్రం తీసిపోమంటూ మహిళలు సైతం పేకాట ఆడటం ఇప్పుడు పరిపాటిగా మారింది. మూడుముక్కలాట వ్యసనం మగువలను గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడేలా మార్చేసింది. కిట్టీ పార్టీ పేరుతో కొందరు మహిళలు రాత్రి పగలు తేడా లేకుండా ఆడేస్తున్నారు. పైగా వేలకు వేలు పందెం కడుతూ హోదా కోసం తహతహలాడుతున్నారు. పేకాట క్వీన్స్ ఎట్టకేలకు పేలీసులకు పట్టుబడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నా ఒకటి రెండు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. 


13 మంది అరెస్ట్
ఇటీవల మూడు రోజుల క్రితం ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ జరిగింది. ఏకంగా ఓ అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా పెద్ద పెద్దవాళ్లే ఉన్నారని తెలుస్తోంది. కిట్టీ పార్టీపేరుతో పిలిచి పేకాడుతూ సేద తీరుతున్నారు. ఎలాగో సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా వారి కళ్లు బయర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది మహిళలు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారు చెప్పిన వివరాలు విన్న పోలీసులకు దిమ్మ తిరగినంత పనైంది. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


అద్దెకు అపార్ట్‌మెంట్?
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో జ్యోతి అనే మహిళ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంది. రెండు నెలలుగా అందులో కిట్టీ పార్టీ పేరుతో పేకాట  నిర్వహిస్తోంది. ఈ కేంద్రానికి చాలా మంది పెద్ద పెద్ద వారు వస్తుంటారు. దీని గురించి ఈ నెల 27న పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి 13 మంది మహిళలను అరెస్ట్ చేశారు.  స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  మహిళల నుంచి లక్షా ఇరవై వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. రెండు టేబుల్స్‌లో మహిళలు పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జ్యోతి మహిళలతో పేకాట నిర్వహిస్తూ కమీషన్లు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


పెద్ద కుటుంబాలకు చెందిన వారే నిందితులు
పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో చాలా మంది పెద్ద, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు మహిళా వ్యాపారవేత్తలు, ఏడుగురు హౌస్ వైఫ్‌లు ఉన్నట్లు సమాచారం. మహిళల వయస్సు 50-70 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. కిట్టీ పార్టీ పేరుతో మహిళలు తరచూ పేకాట ఆడడానికి వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.  రెండు నెలలుగా అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్నట్లు మహిళలే పోలీసులకు చెప్పడం గమనార్హం. కాగా.. రెండ్రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.