APBJP On Special Status : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై వైఎస్ఆర్‌సీపీ ప్రజల్ని మభ్య పెడుతోందని ఏపీ బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ముగిసిపోయిన అధ్యాయం అని తెలిసినా సందర్భం లేకుండా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. లేని ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ప్రజలను మోసం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వాస్తవమైతే 2024 ప్రత్యేక హోదా సాధిస్తామనే అజెండాతో వైకాపా పార్టీ ఎన్నికల వెళ్తుందని మీ ముఖ్యమంత్రి జగన్ గారితో ప్రకటన చేయించాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని సవాల్ చేశారు.
రాజ్యసభలో ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించిన విజయసాయిరెడ్డి
రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మంగళవారం లేవనెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయని ఆక్రోశించారు. ప్రత్యేక హోదా అంశంలో ఆ రెండు పార్టీలు సంయుక్తంగా విఫలమయ్యాయని అన్నారు. అందుకే 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కు అని ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతోందని, కానీ హోదా కోసం తాము పోరాటం కొనసాగిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీలు వచ్చినా, ప్రభుత్వం అనేది కొనసాగుతుందని, ఇచ్చిన హామీలను ఆ విధంగా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయన్న విజయసాయిరెడ్డి
నవ్యాంధ్రప్రదేశ్ కు 10 సంవత్సరాల పాటు ప్రత్యేకహోదా కల్పిచాలని అప్పట్లో విపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా చెప్పారని విజయసాయి గుర్తుచేశారు. నాడు వెంకయ్య అభిప్రాయాన్ని కాంగ్రెస్ కూడా సమర్థించిందని తెలిపారు. ఆ తర్వాత, కేంద్రంలో కాంగ్రెస్ ఓటమిపాలై బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇచ్చిన హామీని మాత్రం మర్చిపోయిందని విమర్శించారు. దీనిపైనే విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
ఏపీ రాజకీయాల్లో భావోద్వేగ పూరితమైన అంశం ప్రత్యేకహోదా - ముగిసిపోయిన అధ్యాయమంటున్న బీజేపీ
ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై బీజేపీ స్పష్టతతో ఉంది. ఆ పార్టీ నేతలు ఎవరూ ప్రత్యేక హోదా వస్తుందని కానీ.., పరిశీలిస్తామనానీ చెప్పడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకహోదా రాదంటున్నారు. అయితే గత ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రంలో ఎవరు ఉన్నా మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే కేంద్రంతో ఆయన సఖ్యతగా ఉంటున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రత్యేకహోదా అడుగుతున్నామని చెబుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఎప్పటికప్పుడు హోదా అనే ప్రశ్నే లేదంటోంది. కానీ తాము అడుగుతూనే ఉంటామని వైఎస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో రాజకీయంగా ఓ ఉద్దేగ పూరితమైన అంశాన్ని ఎప్పటికప్పుడు లైవ్‌లో ఉంచుతూ.... అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడానికి ఇలాంటి వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.