AP BJP On Verma :  ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌ తీరుపై ఏపీ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేసింది.  కొందరు వైఎస్ చాన్సలర్ల  తీరు వల్ల  దేశంలోని యూనివర్శిటీల ముందు ఏపీ పరువు తీస్తున్నారని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి  విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 
విద్యార్థులకు సందేశమివ్వటానికి ఎలాంటి వ్యక్తులను అతిథిగా పిలవాలో కూడా  ఏఎన్‌యూ  వైస్ ఛాన్సలర్  రాజశేఖర్ కు తెలియదా అని ప్రశ్నించారు.   వీసీ పదవికి రాజశేఖర్ ఎలా అర్హులని ప్రశ్నించారు.  


సీఎం జగన్, గవర్నర్ చర్యలు తీసుకోవాలన్న ఏపీ బీజేపీ 


నాగార్జున విశ్వవిద్యాలయంలో  జరిగిన సమావేశానికి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  భావి భారత పౌరులు దారి తప్పేలా సందేశం ఇస్తున్నా ఒక్కర అడ్డుకోలేదన్నారు. అలాంటి తప్పుడు సందేశాలను  అక్కడున్న ఉపాధ్యాయులు కూడా సమర్థిస్తారా? అని విష్ణువర్ధన్ రెడ్డి  ప్రశ్నించారు. వారి పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు కూడా అలాంటి మాటలే చెప్పి ప్రోత్సహిస్తారా? దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను ఎటువైపు నడిపించాలనుకుంటున్నారు విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విశ్వవిద్యాలయంలో తప్పుడు అతిథికి అవకాశం ఇచ్చిన బాధ్యతారాహిత్యమైన  వీసీ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.   రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌ అయినటువంటి రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించాలన్నారు. 


ఆర్జీవీ ఏమన్నారంటే ? 


తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023కు రామ్ గోపాల్ వర్మ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ చదువుకుని బాగుపడాలి అనే సిద్ధాంత తన దృష్టిలో వేస్ట్ అని.. తాగండి, శృంగారం చేయండి అంటూ చెప్పుకొచ్చారు.  సాధారణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పైకి వచ్చాం అని చెప్తారు. దాన్ని నేను నమ్మను. స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోండి. మనం చేసే పనిని పక్కవాడితో చేయించేలా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు.  నేను కాలేజీకి వచ్చాను కదా అని నేనో పెద్ద గొప్ప స్టూడెంట్ అనుకోవద్దు. నేను బ్యాక్ బెంచ్ లో కూర్చుని నోవెల్స్ చదివేవాడిని. కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్లి అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని. ఇక నా గురించి చెప్పుకోవాలంటే పిచ్చి నా కొడుకుని, జంతువుని అని ఆర్జీవీ విద్యార్థుల మనసులు తప్పుదోవ పట్టేలా వ్యాఖ్యానించారు. వేదికపై ఉన్న వారు ఎవరూ మాట్లాడలేదు. 


వీసీ వ్యవహారంపై మొదటి నుంచి తీవ్ర విమర్శలు ! 


వీసీ సహా అనేక మంది  ఉపాధ్యాయులు ఉన్నా అదే పరిస్థితి. ఆర్జీవీ ఆశ్లీల సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోయాడని..   ఆతని తీరు వల్ల విద్యార్థులు దారి తప్పుతారని.. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అవే పాఠాలు చెప్పించడం ఏమిటని విద్యావేత్తలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.