BJP demands renaming of Guntur Jinnah Tower: గుంటూరులో జిన్నాటవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జిన్నా టవర్ బానిస చిహ్నమన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఇటీవల విమర్శించారు. జిన్నాటవర్ పేరు మార్చాల్సిందేన్నారు. మాధవ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వైసీపీ నేత గులాం రసూల్ తప్పు పట్టారు. బీజేపీ నేతలు మత రాజకీయం చేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రసూల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత జయప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిన్నాను ప్రేమించేవాళ్లు పాక్‍కు వెళ్లిపోవచ్చంటూ సూచించారు.
పాకిస్తాన్ జాతి పిత పేరుతో గుంటూరులో టవర్
గుంటూరులో జిన్నాటవర్ సెంటర్ ఉంది. జిన్నా టవర్ వల్లనే ఆ సెంటర్ కు ఆ పేరు వచ్చింది. అయితే ఆ టవర్‌ను పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించారని చాలా మందికి తెలియదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై వివాదం ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు జిన్నా టవర్ పేరును మార్చాలని లేదా స్థూపాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరుతో స్థూపం ఉండటం సముచితం కాదని, ఇది "బానిస చిహ్నం" అని వారు వాదిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్వాతంత్య్ర సమరయోధులు లేదా ఏపీజే అబ్దుల్ కలాం, గుర్రం జాషువా వంటి వారి పేర్లను పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
జిన్నా దేశ స్వాతంత్ర సమరయోధుడంటున్న వైసీపీ నేతలు జిన్నా టవర్ స్వాతంత్య్రోద్యమ కాలంలో నిర్మితమైంది. జిన్నా సన్నిహితుడైన లియాఖత్ అలీ ఖాన్ ఈ స్థూపం ఆవిష్కరణ సభకు హాజరయ్యారు. ఆ కాలంలో జిన్నా గాంధీ, నెహ్రూ వంటి నాయకులతో కలిసి పనిచేశారు. అయితే తర్వాత పాకిస్థాన్ ఏర్పాటుకు డిమాండ్ చేయడంతో దేశ విభజనకు దారితీసింది. జిన్నా పాకిస్తాన్ జాతి పిత అయ్యారు. వైసీపీ హయాంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ సమయంలో జిన్నా టవర్ జాతీయ జెండా రంగులు వేసి ఎవరూ ధ్వంసం చేయకుండా చూశారు. జిన్నా స్వాతంత్య్ర సమరయోధుడని వైసీపీ నేతలంటున్నారు.
పేరు మార్పు వివాదంపై ప్రభుత్వం స్పందన ఏమిటో ? జిన్నా టవర్ వివాదం గుంటూరులో రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది. బీజేపీ దీనిని దేశభక్తి అంశంగా, వైసీపీ మత సామరస్యం అంశంగా చూపిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయి. మాధవ్ ఇటీవల విజయవాడలో పర్యటించినప్పుడు లెనిన్ సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గుంటూరు జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలంటున్నారు. బీజేపీ కూడా కూటమిలో భాగం కావడంతో ... ప్రభుత్వ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.