గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thandavam). మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది. విడుదల తేదీతో పాటు కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
డబ్బింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ!Akhanda 2: 'అఖండ 2' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం పూర్తి అయింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ అంతా బాలకృష్ణ పూర్తి చేశారు. మిగతా పాత్రధారులు డబ్బింగ్ వర్క్ సైతం మొదలు అయింది.
శరవేగంగా రీ రికార్డింగ్, సీజీ పనులు!ప్రస్తుతం 'అఖండ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఒక వైపు రీ రికార్డింగ్ పనులు, మరొక వైపు విజువల్ ఎఫెక్ట్స్ - సీజీ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆగస్టు నెలాఖరుకు సినిమా పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
'అఖండ 2' విడుదలపై నో డౌట్స్!సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ' విడుదలకు రెడీ అవుతోంది. అదే తేదీన బాలకృష్ణ 'అఖండ 2' సైతం థియేటర్లలోకి రానుంది. అయితే రెండు సినిమాలలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. తమ సినిమా విడుదల విషయంలో సందేహాలు అవసరం లేదన్నట్లు సెప్టెంబర్ 25న 'అఖండ 2' విడుదల చేస్తామని మేకర్లు మరోసారి కన్ఫర్మ్ చేశారు. దసరా సందర్భంగా సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
బాలకృష్ణ సరసన సంయుక్త!'అఖండ' సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కనిపించింది. అయితే సీక్వెల్ వచ్చేసరికి హీరోయిన్ మారింది. ఇందులో సంయుక్త హీరోయిన్ బాలకృష్ణతో ఆవిడకు తొలి చిత్రమిది. ఇందులో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ - బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఇది. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'అఖండ 2' చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ కళా దర్శకుడు. తమ్మిరాజు ఎడిటర్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేశారు. సి రాంప్రసాద్, సంతోష్ డీటకే సినిమాటోగ్రఫీ అందించారు.