Chandrababu Naidu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu)ను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు  అరెస్టు చేశారు. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌కు చేరుకొని నోటీసులు అందజేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్తున్నారు. నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు.


చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ, సీపీఐ నేతలు ఖండించారు. చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీదేవి(Daggubati Purandeswari) ఖండించారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు. వివరణ తీసుకోకుండా, విధానాలు అనుసరించకుండా అరెస్టు సరికాదని పురందేశ్వరి అన్నారు.






అలాగే చంద్రబాబు అరెస్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులిచ్చి చర్యలు తీసుకోవచ్చన్నారు. పోలీసులు అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. లోకేశ్ సహా టీడీపీ నేతలను నిర్బంధించటం దుర్మార్గమని రామకృష్ణ అన్నారు.


రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదని చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు.


శ్రీకాకుళంలో టీడీపీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు హస్ అరెస్ట్ చేశారు. అలాగే విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబును ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఇచ్చాపురంలో ఎమ్మెల్యే అశోక్, విజయవాడలో దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, రాజాంలో కళా వెంకట్రావు, గుడివాడలో వెనిగండ్ల రాము ఇంటికి వెళ్లిన పోలీసులు వారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే బోడే ప్రసాద్‌ను  గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించారు.


విజయవాడలో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉమా ఇంటికి వెళ్లే దారిని బారికేడ్లు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో బారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు విజయవాడ పోలీసులు యత్నిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 


శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎన్ఎస్ గేట్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత నిరసన తెలిపారు.  చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నేతలతో కలిసి నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఎట్టకేలకు పరిటాల సునీతను పోలీసులు అరెస్ట్ చేసి ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. తన నివాసం లోపలికి పోలీసులు రావడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసం గేటు బయట ఉండాల్సిన పోలీసులు లోపలికి రావడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన ఇంట్లోకి వస్తే పోలీస్లు అధికారి కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీసం నోటీసు లేకుండా పోలీసులు తన నివాసంలోకి ఎలా కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నివాసం వద్దకు మరింత పోలీసు సిబ్బంది తరలించారు. కోటం రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 






కక్షసాధింపే; జీవీ శ్రీరాజ్


స్టేషన్ బెయిల్ సెక్షన్స్‌లో అరెస్ట్ చేసి కోర్ట్ నుంచి బెయిల్ తెచ్చుకోమన్నారంటే ఇది కచ్చితంగా కక్ష సాధింపే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్‌. చంద్రబాబు అరెస్టును ఖండించిన ఆయన ప్రభుత్వం చేస్తుంది దుర్మార్హగమైన చర్యగా అభివర్ణించారు. శని,ఆదివారాలు కోర్టులకు సెలవులు పెట్టుకొని అరెస్టు చేశారంటే వారి మోటో ఏంటో అర్థమైపోతుందన్నారు.