YS Jagan Changes District Incharges: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ(YCP)లో కొంతమంది సీనియర్లు యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమయ్యారు. మరికొందరు పార్టీలు మారుతున్నారు. ఈ దశలో పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసేందుకు కొత్త వారికి జిల్లాల బాధ్యతలు అప్పగించారు జగన్(Jagan). ఈ మార్పు పార్టీకి ఏ మేరకు లాభం అనేది వేచి చూడాలి.
ఇటీవల జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఆయా జిల్లాల్లో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు.?, జిల్లా అధ్యక్షులుగా ఎవరిని ఉంచాలి.? నియోజకవర్గాల ఇంఛార్జీలుగా ఎవరు ఉండాలి.? అనేది డిసైడ్ చేస్తున్నారు. తాజాగా 4 జిల్లాలకు కొత్త అధ్యక్షులను(District Presidents) నియమించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి అవకాశం ఇచ్చారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడిని నియమించారు. అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుని ఛాన్స్ ఇచ్చారు. ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జునకు అవకాశం ఇచ్చిన జగన్, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ ఎంపీ నందిగం సురేష్‌ని నియమించారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ప్రస్తుతం నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కి వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం ఇచ్చారు. ఇదే కమిటీలో మరో మెంబర్‌గా రాష్ట్ర పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మిని నియమించారు జగన్.
ఇటీవలే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఛాన్స్ ఇచ్చిన జగన్.. కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా మరో మాజీ మంత్రి పేర్ని నానిని నియమించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు దేవినేని అవినాష్ కి అప్పగించారు. ఆమధ్య నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని మాజీ మంత్రి కాకాణికి ఇచ్చారు.
ఎన్నికల తర్వాత జిల్లాల్లో వైసీపీ కార్యక్రమాలు కాస్త స్తబ్దుగా మారాయి. ఎన్నికల ముందు సవాళ్లు విసిరిన నేతలంతా ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్న వారికే మరిన్ని బాధ్యతలను జగన్ అప్పగిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రులకు అవకాశమిచ్చారు. నియోజకవర్గ ఇంఛార్జీలను కూడా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే నియమించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ట పరిస్తే.. ఐదేళ్ల తర్వాత వారే అభ్యర్థులుగా ఉండొచ్చనే హామీ ఇచ్చారు.
పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా మెల్లగా జోరందుకోబోతున్నాయి. ఇటీవల విజయవాడ వరదల సందర్భంగా వైసీపీ నేతలు ప్రజల్లోకి వచ్చారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు పెంచాలని చూస్తున్నారు. ఇంఛార్జీలను మార్చి, కొత్త కార్యక్రమాలతో తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.