CM Chandrababu Anger On Ys Jagan Comments In Tirumala Declaration Issue: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను (Jagan) తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని.. ర్యాలీలు, జనసమీకరణలు చెయ్యొద్దని మాత్రమే చెప్పామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకున్నారన్న జగన్ వ్యాఖ్యలపై సీఎం కౌంటర్ ఇచ్చారు. తిరుమల అంశంపై జగన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 'రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు మీకు ఉన్నాయా.? తిరుమలకు వెళ్తే ఆలయ సంప్రదాయాలు పాటించాల్సిందే. అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు. దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని మీకు ఎవరు చెప్పారు.?. సీఎంగా ఉన్నప్పుడే చట్టాలను ఉల్లంఘించానని ఎలా చెబుతారు.?. స్వామి వారిని రాజకీయాలు, వ్యాపారాలకు వాడుకోవడం మీరు చేసిన తప్పు. టీటీడీ అధికారుల నియామక విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కల్తీ ఘటనలో తప్పు చేసిన వారందరిపై చర్యలు ఉంటాయి.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
'నియమాలు పాటించాల్సిందే'
తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే ఎవరైనా ఆచారాలు, నియమాలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర మతాలను గౌరవించాలని.. సొంత మతాన్ని ఆచరించాలని అన్నారు. 'ఇటీవల తిరుమలలో జరిగిన పరిణామాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుపతిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఏ మతానికైనా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఇంతకుముందు జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారు. చాలామంది డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారు. బైబిల్ 4 గోడల మధ్యే ఎందుకు చదవాలి.?. చర్చికి వెళ్లి కూడా చదవొచ్చు. జగన్ చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అడల్టరేషన్ పరీక్షకు గతంలో మీరు ఎందుకు పంపలేదు.?. టెండర్లు పిలిచేందుకు నిబంధనలు ఎందుకు మార్చారు.? నాసిరకం పదార్థాలతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. రామతీర్థం, అంతర్వేది ఘటనలపై ఇంతవరకూ విచారణ జరగలేదు. తిరుమలలో తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తే సంప్రోక్షణ చేస్తారు. ఈ నెల 23న శాంతియాగం చేశారు. వేంకటేశుని సన్నిధిలో అపవిత్రం కాకుండా చూస్తాం.' అని సీఎం తెలిపారు.