Bhubaneswar To Visakha Vandebharat Fare Details: తూర్పు కోస్తా రైల్వే పరిధిలో భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Bhubaneswar To Vandebharat Train) రైలును ఈ నెల 12న ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17 నుంచి ప్రయాణానికి ఐఆర్ సీటీసీలో టికెట్లు అందుబాటులోకి రాగా.. తాజాగా టికెట్ ధరల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ రైలు (20841/20842) సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 5:15 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి ఉదయం 11:30 గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి రాత్రి 9:55 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలో మీటర్ల దూరాన్ని సుమారు 5:45 గంటల్లోనే చేరుకుంటుంది. 


టికెట్ ధరలు ఎంతంటే.?


అన్నీ వందేభారత్ రైళ్ల తరహాలోనే ఈ రైలులోనూ ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. భువనేశ్వర్ నుంచి విశాఖకు ఏసీ చైర్ కార్ ప్రయాణానికి రూ.1,115 ధరగా నిర్ణయించారు. బేస్ ఫేర్ రూ.841, రిజర్వేషన్ ఛార్జ్ రూ.40, సూపర్ ఫాస్ట్ ఛార్జ్ రూ.45, జీఎస్టీ ఛార్జ్ రూ.47, కేటరింగ్ ఛార్జ్ రూ.142గా నిర్ణయించారు. ఒకవేళ ప్రయాణికులు ఆహారం వద్దు అనుకుంటే ఆ ఫేర్ ను టికెట్ ధరలోంచి మినహాయిస్తారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2,130గా పేర్కొన్నారు. ఇందులో కేటరింగ్ ఛార్జ్ రూ.175గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణంలో చైర్ కార్ టికెట్ ధర రూ.1,280 గానూ, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2,325గా నిర్ణయించారు.


మొత్తం 10 రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించగా.. ఏపీ నుంచి నడిచే వందేభారత్ రైళ్ల సంఖ్య మూడుకు చేరుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలును అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మొత్తం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.