Pawan Kalyan Not Attend : మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ భీమవరం విచ్చేశారు. తెలంగాణలో బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలను ముగించుకొని సోమవారం ఉదయం ఏపీకి వచ్చారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకి చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం భీమవరంలో బహిరంగ సభలో ప్రధాని మోదీ  అల్లూరి విగ్రహావిష్కరణ చేశారు. మన్యం వీరుడి వంశీకులను, ఆయన అనుచర కుటుంబ సభ్యులను సత్కరించారు. తెలుగువీరలేవరా.. దీక్షబూని సాగరా అంటూ తెలుగులో మొదట మాట్లాడిన మోదీ ఆ తర్వాత హిందీలో ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీజేపీ నేత పురంధేశ్వరి తెలుగులో అనువాదం చేశారు. 


పవన్ డుమ్మా 


అల్లూరి స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని చెబుతూ ఆయన సేవలకు గుర్తుగా లంబసింగిలో మెమోరియల్, మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. అలాగే మన్యం వీరుడు తిరిగిన ప్రదేశాలన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఈ జయంతి వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి హాజరవడం విశేషం. కానీ బీజేపీకి మిత్రపక్షమైన జనసేన కానీ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కానీ ఈ సభకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాలేదు. అందరికీ ఆహ్వానాలు పంపామని బీజేపీ నేత సీఎం రమేష్‌ అన్నారు. అయితే టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఆహ్వానం ఉన్నా తమ దగ్గర లిస్ట్‌ లో పేరు లేదని జిల్లా కలెక్టర్‌ చెప్పడంతో ఆయన రాలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. పిలిచి అవమానించడం సరైంది కాదని అచ్చెన్నాయుడు అధికారపార్టీపై విమర్శలు చేశారు. 


చిరంజీవిని ఆహ్వానించడంపై చర్చ 


అలాగే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తనకు ఆహ్వానం ఉన్నా అనుమతించలేదని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అయితే ఈ వేడుకకు చిరంజీవిని ఎందుకు ఆహ్వానించారు అన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కేంద్ర పర్యాటక మంత్రిగా పనిచేశారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే తమ్ముడికి చెక్‌ పెట్టేందుకే అధికారపార్టీ అన్నయ్యని పిలిచిందన్న టాక్ నడుస్తోంది. చిరంజీవితో ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించడంతో ఈ వాదనలకు మరింత బలాన్నిచ్చినట్లైంది. 


Also Read : Chiru Modi Bonding : మోదీ ఆత్మీయతకు చిరంజీవి ఫిదా ! రాజకీయం మారే చాన్స్ ఉందా ?


Also Read : How Raghurama Name Missing : పీఎంవో జాబితాలోనూ రఘురామ పేరు లేదెందుకు ? స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ దక్కదా ?