Bellamkonda ZPTC : ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీలో రోజు రోజుకు  అంతర్గత సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల సీఎం జగన్  పాలనా తీరుపై ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీనికి పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలే కారణం అని అనుకుంటున్నారు. తాజాగా ద్వితీయ శ్రేణి నేతలు కూడా అలాంటి అసహనమేవ్యక్తం చేస్తున్నారు. పల్నాడులో ఓ వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ ప్రభుత్వం తీరు, సొంత పార్టీ నేతల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలంరేపుతోంది. 


పెదకూరపాడు ఎమ్మెల్యే తీరుపై బెల్లంకొండ జడ్పీటీసీ ఆగ్రహం 


పెదకూరపాడు నియోజకవర్గంలో భాగమైన బెల్లకొండ నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపున గాదె వెంకటరెడ్డి  జడ్పీటీసీగా గెలిచారు. ఆయనకూ  ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మధ్య ఇటీవల విభేదాలొచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ అంటే అభిమానంతో పార్టీలో చేరామని, ‘యాత్ర ’ సినిమా ప్రదర్శన కోసం బంగారం  తాకట్టు పెట్టి మరీ సినిమా హాలు అద్దెకు తీసుకొని ప్రదర్శించామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో రూ. కోటికి పైగా ఖర్చు పెట్టానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక బెల్లంకొండ మండలం జడ్పీటీసీగా గెలిచానన్నారు. పార్టీ కోసం తనకున్న 70 ఎకరాలకు పైగా అమ్మానన్నారు. ఈ నాలుగేళ్ళల్లో తన సొంత సమస్యలే పరిష్కారం చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 


వైఎస్ఆర్‌సీపీ కోసం ఆస్తులమ్మి పని చేసినా గౌరవించడం లేదని ఆవేదన 


తనను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యలను ఎలా తీర్చాలన్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెబుతున్నా పట్టించుకోవడంలేదని, సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రోత్సహిస్తున్నారని గాదె వెంకటరెడ్డి మండిపడ్డారు. గాదె వెంకటరెడ్డి బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామానికి చెందిన వారు. ఆయన ఐదేళ్ల పాటు గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. వైసీపీలో కీలకంగా పని చేయడంతో ఆయనకు జడ్పీటీసీ టిక్కెట్ ఇచ్చారు. కానీ  ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు నుంచి ఆయనకు సహకారం లభించకపోవడం.. పార్టీ కార్యక్రమాలకూ ఆహ్వానించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. 


గతంలోనే టీడీపీలో చేరేందుకు ప్రయత్నం - అడ్డుకున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు 


నిజానికి గాదె వెంకటరెడ్డి జడ్పీటీసీగా గెలవక ముందే తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. నామినేషన్లు వేసిన తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఈ మధ్యలో ఎమ్మెల్యే తీరు ఆయనకు నచ్చకపోవడంతో అభ్యర్థిత్వం ఉపసంహరించుకుని టీడీపీలో చేరాలనుకున్నారు. అయితే అప్పట్లో ఆయన ప్రయత్నాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎలాగోలా అడ్డుకున్నారు. టీడీపీలో చేరేందుకు వెళ్తున్న ఆయనను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అడ్డుకుని వైసీపీ నేతలు వెనక్కి తీసుకెళ్లిపోయారు.  అప్పట్లో ఆయన టీడీపీలో చేరే ప్రయత్నం విరమించుకున్నారు. కానీ ఎమ్మెల్యేపై ఇప్పుడు మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి అసంతృప్తులను పార్టీ హైకమాండ్  సర్ది చెప్పాలన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. 


మూడు రాష్ట్రాల దిశగా ఏపీ పయనిస్తోందా ? సీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు పెరగడం దేనికి సంకేతం ?