K Raghavendra Rao : బాపట్ల జిల్లా నడిగడ్డపాలెంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రంలో ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు సన్మానం చేశారు. ముందు ఎన్టీఆర్ విగ్రహానికి రాఘవేంద్రరావు పుష్ప మాలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దర్శకేంద్రుడు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. 'నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే సినిమా జన్మనిచ్చింది ఎన్టీఆర్. నా సినీ ప్రయాణం ఎన్టీఆర్ తోనే మొదలు అయ్యింది. సినిమాలకి ప్రజలు డబ్బులు జల్లిన చరిత్ర ఎన్టీఆర్ తోనే మొదలు అయ్యింది. ఆయన పురస్కారం అందుకోవడం ఎన్టీఆర్ పై నుంచి నాకు పంపారు అనిపిస్తుంది. ఏ పాత్రలు వేసిన ఎంత మంది నటులు ఉన్న ఎన్టీఆర్ ముందుగా గుర్తుకువస్తారు. అందరు భారతరత్న రాలేదని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ భారత రత్న కాదు ప్రపంచానికే రత్న. సంవత్సరం పాటు శతజయంతి ఉత్సవాలు చెయ్యటం ప్రపంచ చరిత్రలో ఎన్టీఆర్ కే దక్కుతుంది' అన్నారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేస్తున్న తెనాలి వాసులకు ముఖ్యంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు కృతజ్ఞతలు అని రాఘవేంద్రరావు అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెం గ్రామంలో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని దర్శకేంద్రుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి.మాణిక్యాలరావు పాల్గొన్నారు. దిండుపాలెం గ్రామం నుంచి నడిగడ్డపాలెం గ్రామం వరకు దర్శకేంద్రుడుకి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
న్యూజెర్సీలో వేడుకలు
ప్రవాస టీడీపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో శనివారం రాత్రి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. NRI టీడీపీ అమెరికా కన్వీనర్ కోమటి జయరాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పాలనపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రవాసాంధ్రులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఏపీలో పరిపాలన గురించి హేళనగా మాట్లాడుకుంటున్నారన్నారు. ఒకప్పుడు అగ్ర భాగాన ఉన్న రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం అధోగతి పాలు చేసిందన్నారు.