Adilabad RTC Bus : ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళకు డెలివరీ అయింది. ఉట్నూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉట్నూర్ నుంచి చంద్రపూర్ కు వెళ్తోంది. ఇంద్రవెల్లిలో మడావి రత్నమాల అనే ఆదివాసీ గర్భిణీ బస్సులో ఎక్కింది. ఇంద్రవెల్లి నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా గుడిహథ్నూర్ మండలంలోని మాన్కపూర్ సమీపంలో ఆమెకు ఒక్కోసారిగా పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారి కుటుంబసభ్యులు బస్సును నిలిపివేశారు. ఆమె బస్సులోనే ప్రసవించింది. ఆ మహిళ పండంటి మొగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆర్టీసీ సిబ్బంది 108కు సమాచారం అందించారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ అధికారులకు తెలపడంతో వారి ఆదేశాలతో బస్సును ఆర్టీసీ సిబ్బంది గుడిహథ్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 






ఆర్టీసీ బస్సులోనే ఆసుపత్రికి 


ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తల్లిబిడ్డలకు తగిన చికిత్స అందించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్ అంజన్న, కండక్టర్ గబ్బర్ సింగ్ లు ఈ విషయాన్ని ఆర్టీసీ డీఎం విజయ్ కుమార్ కు తెలియజేశారు. అయితే డీఎమ్ ఆదేశాలతో డిపో DVM మధుసూదన్ వెంటనే గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తల్లిబిడ్డలను పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి ఆర్టీసీ తరపున అల్పాహారం పండ్లు అందజేశారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది యథావిధిగా తమ బస్సులో చంద్రపూర్ కు బయలుదేరారు.


జీవితకాలం ఫ్రీ ట్రావెల్ 


ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం విషయాన్ని పై అధికారులకు తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ఆదేశాలతో బస్సులలో ప్రయాణ సమయంలో జన్మించిన బిడ్డలకు జీవితకాలం ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు తెలిపారు. డ్యూటీలో ఉన్న కండక్టర్ గబ్బర్ సింగ్, డ్రైవర్ అంజన్నలను ఆర్టీసీ యాజమాన్యం అధికారులు ప్రశంసించారు. తల్లిబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి తీసుకెళ్లినందుకు కుటుంబ సభ్యులు డ్రైవర్, కండక్టర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.