Minister Ambati Rambabu : ఆత్మకూరు ఉప ఎన్నికలో ఊహించిన విధంగానే వైసీపీ ఘన విజయం సాధించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైందన్న ఆయన ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేశారన్నారు. టీడీపీ పోటీ చేయకపోయినా, బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేసిందని ఆరోపించారు. టీడీపీ క్యాడర్‌ను ఈ ఎన్నికలో ఉపయోగించుకున్నారన్నారు. ఏదో విధంగా వైసీపీని ఓడించాలనో, ఓట్ల శాతాన్ని తగ్గించాలనో తీవ్ర ప్రయత్నం చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీని ఆత్మకూరు ప్రజలు కట్టబెట్టారని తెలిపారు. 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతం రెడ్డి 22,276 ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. ఈ ఉప ఎన్నికలో మేకపాటి గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి 74.47 శాతం ఓట్లు సాధించి, 82,888 ఓట్ల మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నారన్నారు. 


వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం పెరుగుతోంది


రాష్ట్రంలో ఏ ఉపఎన్నిక జరిగినా, 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ కన్నా చాలా గణనీయమైన మెజార్టీతో గెలుస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం కంటే ఈ ఉపఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లను వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుందన్నారు. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. 


సంక్షేమ పథకాల ఫలితమే 


మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ రోజూ గప్పాలు కొట్టుకునే తెలుగుదేశం పార్టీ, ఇతర ప్రతిపక్షాలు గమనించాల్సిన అంశం ఏంటంటే వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు నిరాఘాటంగా సాగుతున్నాయి. వాటి ఫలాలను అందుకుంటున్న ప్రజలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఘన విజయం కట్టబెడుతున్నారు. ప్రతి ఎన్నికలోనూ మా పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ ముందుకు వెళుతోంది. - మంత్రి అంబటి రాంబాబు 


విషం మద్యంలో కాదు..
 
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న భయంతో టీడీపీ బురద జల్లుతోందని మంత్రి అంబటి ఆరోపించారు. అందుకే కట్టుకథలు అల్లుతోందన్నారు. ఏదోవిధంగా ప్రభుత్వంపై కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మద్యంలో విషం అంటూ తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. టీడీపీ వాళ్లు లిక్కర్‌ బాటిల్స్‌ తీసుకువెళ్లడం, వాటిని ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించడం, వాటిపై కథనాలు రావడం ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న దుష్ప్రచారం అని విమర్శించారు. చంద్రబాబు ఒక ప్లాన్‌ చెబితే దాని ప్రకారం వీళ్లంతా విషం ఉందనో, లేక వాళ్లే కలిపో మద్యం బాటిళ్లను టెస్ట్‌కు తీసుకువెళ్లారని ఆరోపించారు. విషం ఉన్నది మద్యంలో కాదని టీడీపీ వాళ్ల బుర్రల్లో అని మండిపడ్డారు. 


ఆ బ్రాండ్లన్నీ బాబు బ్రాండ్లే


బూమ్ బూమ్, ప్రెసిడెంట్‌ మెడల్‌ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవే అని మంత్రి అంబటి అన్నారు. ఏ డిస్టలరీ నుంచి అయినా మద్యం విడుదల అయితే దానికో పద్దతి, విధానం ఉంటుందన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ చేసిన తర్వాతే ఆ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తారన్నారు. ఇదేమీ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదన్నారు.