ఒలింపిక్ విజేత, అమెరికన్ అథ్లెట్ సిడ్నీ మెక్‌లాలిన్ తన సొంత ప్రపంచ రికార్డును సవరించింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త రికార్డును నమోదు చేసింది. 400 మీటర్ల హర్డిల్స్‌ను సిడ్నీ మెక్‌లాలిన్ కేవలం 51.41 సెకన్లలో పూర్తి చేసింది. గతేడాది టోక్యో ఒలంపిక్స్‌లో 51.46 సెకన్లలో 400 మీటర్ల హర్డిల్స్‌ను పూర్తి చేసిన సిడ్నీ మెక్‌లాలిన్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ రికార్డు ఇప్పుడు బద్దలయింది.


యూఎస్ అవుట్‌డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్స్‌లో సిడ్నీ ఈ రికార్డును సృష్టించింది. నేషనల్ చాంపియన్ షిప్స్‌లో ప్రతి ఈవెంట్‌లో టాప్-3లో నిలిచిన వారు వరల్డ్ అవుట్ డోర్ చాంపియన్ షిప్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తారు. జులైలో అమెరికాలో ఈ ఈవెంట్ జరగనుంది. ఒలంపిక్స్ తప్ప ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అతిపెద్ద ఈవెంట్ అమెరికాలో జరగడం ఇదే మొదటిసారి.


డిఫెండింగ్ చాంపియన్ దెలీలా ముహమ్మద్ చిన్న గాయం కారణంగా రేసుకు దూరం అయింది. అయితే ఆమె ఇప్పటికే వరల్డ్ అవుట్‌డోర్ చాంపియన్ షిప్స్‌కు ఎంపిక అయింది. ఈ రేసులో రెండో స్థానంలో బ్రిట్టన్ విల్సన్, మూడో స్థానంలో షమియర్ లిటిల్ నిలిచారు. వీరు కూడా వరల్డ్ అవుట్‌డోర్ చాంపియన్ షిప్స్‌కు ఎంపిక అయ్యారు.


ట్రాక్ హిస్టరీలో ఎన్నో రికార్డులు సాధించిన అలిసన్ ఫీలిక్స్ ఆరో స్థానంలో రేసును ముగించింది. ఇదే తన ఫైనల్ సీజన్ అని ఫీలిక్స్ ఇప్పటికే ప్రకటించింది. తన కెరీర్‌లో మొత్తంగా 11 ఒలంపిక్ పతకాలను అలిసన్ ఫీలిక్స్ సాధించింది.