Ongole Constituency: ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డబ్బులు తీసుకుంటున్నారని వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. తాను డబ్బులు తీసుకున్నట్లు తేలితే చెప్పుతో కొట్టండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నానని, పట్టాల పంపిణీని అడ్డుకునేవారి ఆఫీస్‌ను 75 వేల మందితో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 25వ తేదీలోపు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేపడతామని, పట్టాలతో పాటు ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని బాలినేని హమీ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో 25 వేల ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో ఆదివారం బాలినేని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై తప్పుడు రాతలు రాస్తే ఊరుకోబోనని ని వార్నింగ్ ఇచ్చారు.
పేదలకు పంపిణీ చేయాలని వైసీసీ సర్కార్ నిర్ణయం
ఇళ్ల పట్టాల పంపిణీకి ఎవరైనా అడ్డుపడితే సహించేది లేదని, వారి సంగతి తేలుస్తానంటూ బాలినేని హెచ్చరించారు. పట్టాలు పంపిణీ చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నారు. అయితే ఒంగోలు జిల్లాలోని అగ్రహారం, చినమల్లేశ్వపురం, వెంగముక్కపాలెం గ్రామాల్లోని స్థలాలను పేదలకు పంపిణీ చేయాలని వైసీసీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆ స్థలాలను చదును చేసి రోడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగిందని, అర్హత లేని కంపెనీలకు టెండర్లు అప్పగించారంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో కూడా దీనిపై కథనాలు వచ్చాయి. దీంతో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తనపై జరుగుతున్న ప్రచారంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే అంతుచూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు.
సీఎం ఊరుకున్నా, తాను వదలనన్న బాలినేని
తనపై ఎన్ని కేసులు పెట్టినా ఫర్వాలేదని, సీఎం ఊరుకున్నా తాను వదిలేది లేదని బాలినేని వ్యాఖ్యానించారు. పట్టాలు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీ టౌన్‌షిప్ తరహాలో అభివృద్ది చేస్తామని అన్నారు. రూ. 251 కోట్లతో 25 వేల పట్టాలు పేదలకు పంపిణీ చేయడం జరుగుతుందని బాలినేని తెలిపారు. వైసీపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న బాలినేని.. తన నియోజకవర్గమైన ఒంగోలుకు చాలా రోజుల తర్వాత శనివారం వచ్చారు.
గత ఏడాది డిసెంబర్ 12న తన జన్మదిన వేడుకలను ఒంగోలులో జరుపుకున్నారు. ఆ తర్వాత 40 రోజుల పాటు నియోజకవర్గానికి రాలేదు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.201 కోట్లు విడుదల చేయడంతో జనవరి 23న నియోజకవర్గానికి వచ్చారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని హైకమాండ్ నియమించడంతో బాలినేని అసంతృప్తికి గురై హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడలో ఉంటున్న బాలినేని.. చాలా రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న బాలినేని.. వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి.