" సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి". ఇదేదో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి మూవీలోని డైలాగ్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవర్ని ఉద్దేశించి ఇంత ఘాటైన, పదునైన వ్యాఖ్యలు చేశారంటూ జనం చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎంటర్‌టైనింగ్ టాక్ షో ఎన్‌బీకే విత్ అన్‌స్టాపబుల్ లోని డైలాగ్ ఇది.
భగవంత్ కేసరి టీం సందడి
బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరించిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి చిత్ర బృందంతో కలిసి సందడి చేశారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కాజల్ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్‌స్టాపబుల్‌లో అతిథులుగా వచ్చిన భగవంత్ కేసరి టీమ్‌ను బాలకృష్ణ ఓ ఆట ఆడుకున్నారు. తన మాటలతో, ఛలోక్తులతో నవ్వులు పూయించారు. ప్రోమో చివరిలో బాలకృష్ణ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులతో చేత విజిల్స్ కొట్టించాయి.
షో ప్రారంభంలోనే చెప్పేశారా ?
"మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవంచం అని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు " అంటూ ప్రొమో ప్రారంభంలోనే బాలకృష్ణ అదిరిపోయే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పేల్చారు. బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చేశారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 35 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోల్చుతూ డైలాగ్ వేశారని అంటున్నారు.
జగనే విలన్ ? చంద్రబాబు హీరో ?
" సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి". రాష్ట్రం బాగునప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి, మొత్తం నాశనం చేశారని డైలాగ్ లతోనే సెటైర్లు వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని, దాన్ని మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలన్నారు. అంటే ఇక్కడ హీరో చంద్రబాబు అని, జైలు నుంచి బయటకు వస్తే అంతా సెట్ చేస్తారంటూ కామెంట్ చేశారు.
డైలాగ్స్ సూపర్
ప్రొమోలో భగవంత్ కేసరి టీం సందడి చేసిన దాని కంటే, బాలకృష్ణ ఏపీలోనే పరిస్థితులపై పేల్చిన పంచ్ డైలాగ్ లు అదిరిపోయాయని ప్రశంసలు కురిపిస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనను, సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారని అంటున్నారు. మొత్తంగా ప్రోమోలో ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నప్పటికీ...బాలకృష్ణ హైలెట్ అయ్యారని అందులోనూ జగన్మోహన్ రెడ్డిను టార్గెట్ చేస్తూ పేల్చిన డైలాగ్స్ హైలెట్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అక్టోబరు 17న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.