Andhra Pradesh News | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హత గల ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందుకోనున్నారు. గత ప్రభుత్వం వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూర్చగా.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు కారణంగా ఇబ్బంది పడకూడదని క్యాబ్, ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

Continues below advertisement

మొత్తం లబ్దిదారుల ఖాతాల్లో రూ.435 కోట్లు జమ

మొత్తం 3,23,375 దరఖాస్తులు రాగా, ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,90,234 మంది డ్రైవర్లను అర్హులుగా గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వారి ఖాతాల్లో మొత్తం రూ.435.35 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఆందోళన చెందవద్దని,  సంబంధిత సమస్యను పరిష్కరించి వారి పేర్లను జాబితాలో చేర్చి ఆర్థిక సహాయం చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సుమారు రూ.435 కోట్లు ఖర్చు చేయనుంది. ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా డ్రైవర్ల ఆదాయ భద్రతకు దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

  సామాజిక వర్గాలు లబ్ధిదారుల సంఖ్య ఖాతాల్లో జమయ్యే నగదు
1 వెనుకబడిన వర్గాలవారు (BC) 1,61,760 242,64,00,000
2 షెడ్యూల్డ్ కులాలు 70,578 105,86,70,000
3 కాపులు 25,694 38,54,10,000
4 షెడ్యూల్డ్ తెగ 13,410 20,11,50,000
5 రెడ్డి 7,023 10,53,45,000
6 ఈబీసీలు 4,190 6,28,50,000
7 మైనారిటీలు 3,968 5,95,20,000
8 కమ్మ 2,607 3,91,05,000
9 క్షత్రియ 520 78,00,000
10 బ్రాహ్మణ 363 54,45,000
11 ఆర్య వైశ్య 121 18,15,000
  మొత్తం 2,90,234 4,35,35,10,000

ఆటో డ్రైవర్ల సేవలో పథకం వివరాలు
- స్కీమ్ ప్రారంభం: అక్టోబర్ 4
- లబ్ధిదారులు: 2.9 లక్షల మంది డ్రైవర్లు
- ఆర్థిక సహాయం: రూ.15,000 వార్షికం
- మొత్తం ఖర్చు: రూ.435 కోట్లు
ఎవరికి: ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు

ఈ పథకం అమలు సందర్భంగా అధికారులు, డ్రైవర్ సంఘాలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంచి దీన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అర్హతల విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందాలని పేర్కొన్నారు.