Atmakur Bypoll : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. సాయంత్రం 6 గంటలకల్లా ఎక్కడి నాయకులక్కడ దుకాణం సర్దేశారు. ప్రచార రథాలు పక్కన పెట్టేశారు. ఇంటింటి ప్రచారం కూడా ఆగిపోయింది. ప్రచారం కోసం ఆత్మకూరు వచ్చిన నాయకులంతా ఎక్కడి వారక్కడ తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. స్థానికేతర నాయకులెవరూ నియోజకవర్గ పరిధిలో ఉండకూడదని, ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో ఎక్కడివారక్కడ తరలి వెళ్తున్నారు. 


ఉప ఎన్నికలకు సంబంధించి ఆత్మకూరులో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయనకు ప్రధాన పోటీదారుగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ ఆత్మకూరులో పోటీ చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థి ఓబులేశు కూడా తన సత్తా చూపిస్తానంటున్నారు. మిగతా ఇండిపెండెంట్లు కూడా తమ ఉనికి చాటుకోవాలనుకుంటున్నారు. మొత్తమ్మీద ఏకగ్రీవం అవుతుందనుకున్న స్థానానికి 14 మంది పోటీలో దిగారు. 


23న పోలింగ్... 26న కౌంటింగ్.. 


ఆత్మకూరు ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈ నెల 23వ తేదీ గురువారం పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,13,138 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 82.44 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గే అవకాశముంది. అయితే అధికార పార్టీ మాత్రం పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తోంది. అలా పెరిగితేనే తాము అనుకున్నట్టుగా లక్ష ఓట్ల మెజార్టీ సాధించగలమని అంటున్నారు నాయకులు. 26న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. 


అధికార పార్టీ ప్రచారం 


ఆత్మకూరు ఉప ఎన్నికలను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచార పర్వానికి తరలివచ్చారు. అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితో కలసి ర్యాలీలు నిర్వహించారు, ఎక్కడికక్కడ స్థానికులతో కలసి ప్రచారం చేపట్టారు. సంక్షేమ పథకాలే తమకు భారీ మెజార్టీ తెచ్చిపెడతాయని భావిస్తున్నారు నాయకులు. మేకపాటి కుటుంబంపై ఉన్న సింపతీ కూడా వైసీపీకి భారీ మెజార్టీని తెచ్చిపెడుతుందనే అంచనాలున్నాయి. 


బీజేపీ ప్రచారం ఇలా..


బీజేపీ తరపున చివరి రోజు కేంద్రమంత్రి ఎల్.మురుగన్ వస్తారనుకున్నా ఆయన రాలేదు, జయప్రద ప్రచారం కూడా రద్దయింది. అయితే రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు.. బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రచారంతో బీజేపీ శ్రేణులకు కాస్త ఉత్సాహం వచ్చింది. అయితే ప్రచారం చివరి రోజున బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం మాత్రం విశేషం. చివరి రోజు మేనిఫెస్టో విడుదల చేసి, తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు బీజేపీ నేతలు. 


ఇక 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ఎన్నికలు జరుపుతామంటున్నారు. మొత్తం 1300 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. వెయ్యి మంది పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు.