Asian Games Winners Meet CM Jagan: అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్  పేర్కొన్నారు. ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు గెలుపొందిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజి జ్యోతి సీఎం జగన్‌ను శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు.


ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో  ఏపీ క్రీడాకారులు సత్తా చారు. మొత్తం 11 పతకాలు సాధించారు. ఇందులో ఐదు బంగారం, ఆరు వెండి పతకాలు ఉన్నాయి. కోనేరు హంపి, బి.అనూష, యర్రాజి జ్యోతి తాము సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని అభినందించారు.  ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ క్రీడాకారులు ప్రతిభ చాటడం గొప్ప విషయం అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా మద్దతు ఉంటుందని చెప్పారు. అనంతరం స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. 


ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు వివరాలు



  • వెన్నం జ్యోతి సురేఖ, ఎన్టీఆర్‌ జిల్లా, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో 3 గోల్డ్‌ మెడల్స్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 90 లక్షలు.

  • ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రాజమహేంద్రవరం, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్, గోల్డ్‌ మెడల్‌ విజేత, ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 50 లక్షలు.

  • బి.అనూష, అనంతపురం, క్రికెట్, ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విజేత, ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 30 లక్షలు. 

  • మైనేని సాకేత్‌ సాయి, విశాఖపట్నం, టెన్నిస్, ఏషియన్‌ గేమ్స్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత, ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.

  • యర్రాజి జ్యోతి, విశాఖపట్నం, అథ్లెటిక్స్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.

  • బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.

  • కోనేరు హంపి, ఎన్టీఆర్‌ జిల్లా, చెస్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.

  • కిడాంబి శ్రీకాంత్, గుంటూరు, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.


ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఆసియా గేమ్స్‌లో భారత దేశానికి 100కు పైగా పతకాలు రావడం గొప్ప విషయం అన్నారు. ఏపీ నుంచి 13 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, 8 మంది 11 పతకాలు సాధించినట్లు చెప్పారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆడుదాం ఆంధ్రా ద్వారా ప్రభుత్వం క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీస్తోందన్నారు. ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ.4.29 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కార్యక్రమంలో శాప్‌ ఎండీ ధ్యానచంద్ర, శాప్‌ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.