Har Ghar Tiranga :  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా,  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ 'హర్ ఘర్ తిరంగా'  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. 


ఆగస్టు 11 నుండి 17 వరకూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా !


పంచాయితీ రాజ్,   గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ విభాగంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆదేశించారు.  ప్రతి ఇంటిపైనా ప్రతి ప్రభుత్వ భవనంపైనా ఆగస్టు 11 నుండి 17 వరకూ మువ్వన్నెల జెండా ఎగుర వేసేలా చూడాలన్నారు.  రాష్ట్రంలో 90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలున్నారని వారందరినీ ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాములను చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించి నిర్దేశిత నమూనా సైజుతో కూడిన మువ్వన్నెల జెండాను సమకూర్చుకుని ప్రతి ఇంటిపైనా ఎగురవేసేలా చూడాలని  ఆదేశించారు.


ప్రజల్లో అవగాహన కల్పించాలన్న సీఎస్ 


ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేకంగా లఘ చిత్రాలను రూపొందించి సినిమా ధియేటర్లలో ప్రదర్శించేలా తగిన చర్యలు తీసుకోవాలని సమాచారశాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డిని సిఎస్ ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలు,పట్టణాల్లోని ముఖ్య కూడళ్ళలో హోర్డింగ్లు, ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై ప్రత్యేక పెయింటింగ్‌లు వేయడంతో పాటు బ్యానర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసి ఎండిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు. 


భారీగా ప్రచారం చేయాలని నిర్ణయం 
 
 ఆగస్టు 11 నుండి 17 వరకూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమానికి సంబంధించి 20X30 అంగుళాల సైజుతో కూడిన మువ్వన్నెల జెండాను ఎగురవేయాల్సి ఉంటుందని మరో సీనియర్ అధికారి రజత్ భార్గవ చెప్పారు.రాష్ట్రంలో కోటి 26 లక్షల కుటుంబాలున్నాయని ప్రతి ఇంటిపైన ఈ మువ్వన్నెల జెండా ఎగురవేయాల్సి ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్రోద్యమం, జాతీయ జెండా తదితర అంశాలపై జాతీయ,స్థానిక మీడియా చానళ్ళు, పత్రికల్లో ప్రత్యేక కధనాలు ప్రసారం,ప్రచురణ జరిగేలా చూడాల్సి ఉందని చెప్పారు.అలాగే విజయవాడ,విశాఖపట్నం తదితర ముఖ్య నగరాల్లో ఈకార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక ఈవెంట్లను కూడా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.