APCC Extends MP And Mlas Applications Date: ఏపీసీసీ (APCC) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు శనివారంతో ముగియగా.. ఈ నెల 29 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ (Congress) ప్రకటించింది. ఇప్పటివరకూ 175 అసెంబ్లీ స్థానాలకు 793 దరఖాస్తులు రాగా.. 25 పార్లమెంట్ స్థానాలకు 105 దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. గడువు పెంచాలని నేతలు కోరడంతో మరో 20 రోజులు సమయం ఇస్తున్నట్లు ఏపీసీసీ ప్రకటించింది. అయితే, ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. కాగా, ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది ఆశావహులు పోటీ పడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అటు, తెలంగాణలోనూ ఎంపీ అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఇటీవలే ముగిసింది. 


ఏపీసీసీ చీఫ్ షర్మిల 'రచ్చబండ'


మరోవైపు, ఏపీసీసీ చీఫ్ షర్మిల వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. శనివారం నర్సీపట్నం నియోజకవర్గం ములగపూడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు FIRలో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదని.. అది తెలియక చేసిన పొరపాటే అని స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని.. వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం అని పేర్కొన్నారు. తన మనసు నమ్మింది కాబట్టే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఏ మాత్రం మోసం చేయలేదని  స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన తరిమికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. 'సీఎం జగన్ బీజేపీకి బానిసగా మారారు. వైసీపీ, తెలుగుదేశం రెండూ బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం మనకు వద్దు.' అని అన్నారు.


సీఎంపై విమర్శలు


'వైఎస్సార్ ఆశయ సాధన అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి. ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి.' కానీ జలయజ్ఞం ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేశారని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అనిపించేలా చేశారని మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక పంట నష్ట పరిహారం అందక సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారని ఆరోపించారు. రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని.. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నా హోదా సాధించలేకపోయారని విమర్శించారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే.. ఒక్క రోజు కూడా ఆందోళన చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హడావుడిగా ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని.. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగను అన్నాడని.. నిషేదం పక్కన పెడితే .. సర్కారే మద్యం అమ్ముతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కులు కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.


Also Read: Telangana Budget 2024: అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు - వ్యవసాయ బడ్జెట్‌పై నిరంజన్ రెడ్డి సెటైర్లు