Andhra News : విద్యుత్ ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలన్న డిమాండ్‌లతో ఆగస్టు 17వ తేదీన విద్యుత్ సౌధ వద్ద తలపెట్టిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేశారు విద్యుత్ ఉద్యోగ సంగ నేతలు. పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారని అందుకే తాత్కాలికందా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ధర్నాకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఉద్యోగ నేతలు తెలిపారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక స్ట్రగుల్ కమిటీ ధర్నా నిర్వహిస్తుందని.. అనంతరం మహాధర్నా తేదీని ప్రకటిస్తామన్నారు.
23 శాతం ఫిట్ మెంట్ సహా పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టిన విద్యుత్ ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే విద్యుత్ ఉద్యోగులకు కూడా కనీసం 23 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విద్యుత్ ఉద్యోగ సంఘ నేతలు కోరుతున్నారు. విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించిన 8శాతం ఫిట్‌మెంట్‌ను స్ట్రగుల్ కమిటీ అంగీకరించడం లేదని చెబుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల పైన ప్రభుత్వంలో సంఘాలతో చర్చలు చేసింది. పర్సనల్ పే నెలకు రూ.2.40 లక్షల నుంచి రూ.2.49 లక్షల దాకా చెల్లించడంతో పాటు ఫిట్‌మెంట్ 7 శాతానికి.. మాస్టర్ స్కేల్‌పై 3.2 శాతం పెంపుదలకు యాజమాన్యం ఆమోదించింది. యాజమాన్యం చేసిన ప్రతిపాదనలకు జేఏసీ అంగీకరిస్తే, క్యాడర్ స్కేల్ ఉద్యోగులకు పర్సనల్ పే అమలు విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతామని తెలిపింది. అందుకు జేఏసీ నేతలు అంగీకరించారు. దీంతో సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
పీఆర్సీ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు జేఏసీ నిరాకరణ - మొదటికి వచ్చిన పోరాటం
పీఆర్సీకి ఒప్పందానికి జేఏసీ ఆమోదం తెలపడంపై విద్యుత్తు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జిల్లాల్లో ఉద్యోగ సంఘాల కార్యవర్గాలకు పలువురు రాజీనామా చేశారు. పీఆర్‌సీ ఒప్పందాలపై సంతకాలు చేద్దామంటూ జేఏసీకి యాజమాన్యం నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు జేఏసీ నేతలు విద్యుత్తు సౌధకు వెళ్లి పీఆర్సీకి సంబంధించిన ముసాయిదాపై యాజమాన్యంతో చర్చించారు. సాయంత్రం 6.30 గంటల వరకూ ముసాయిదా ఒప్పంద పత్రాలను జేఏసీ ఆమోదించలేదు. పేస్కేళ్లు, ముసాయిదా పూర్తి సారాంశంపై చర్చించాకే సంతకాలు చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశా రు. ఇందుకు జేఏసీ అంగీకరించలేదు. ఫిట్‌మెంట్ 15 శాతం కావాలని, క్యాడర్ స్కేల్ ఉద్యోగులకు పర్సనల్ పేకు ఆమోదించేది లేదని తేల్చి చెప్పింది. మిగిలిన డిమాండ్లలో కూడా యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కోరింది. చివరికి మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్లయింది.
చర్చలతో పరిష్కరించాలని ప్రభుత్వం ప్రయత్నం
ఇప్పుడు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు ఛలో విజయవాడ వాయిదా వేసుకోవటంతో టెన్షన్ తప్పింది. ప్రభుత్వం తాము విద్యుత్ ఉద్యోగుల సమస్యపైన సానుకూల ధోరణితో ఉన్నామని చెబుతోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసేందుకు ప్రభుత్వంలోని ముఖ్యులు ప్రయత్నిస్తున్నారు.