Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు  రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై తొలి జాబితా రెడీ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. కానీ కొత్తగా అభ్యర్తుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయిచింది. దరఖాస్తు ధరను రూ. యాభై వేలుగా నిర్ణయించారు. ఈ మొత్తం కట్టి సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రిజర్వుడు నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మాత్రం రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలాగే.. బీసీ నేతలు మాత్రం రూ. పాతిక వేలు కడితే సరిపోతుంది. అలా ఎంత మంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖచ్ిచతంగా దరఖాస్తు చేసుకున్న వారికే టిక్కెట్ల పరిశీలన ఉంటుందని టీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పద్దెనిమిదో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.  తర్వాత కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్క్రీనింగ్ నిర్వహిస్తారు.            


కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు కొంటే పార్టీకి నిధుల సాయం చేసినట్లే !                              


కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా అధికారంలో లేకపోవడంతో పార్టీ నిర్వహణకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిధుల సమస్య ఏర్పడటంతో ...  వినూత్న మార్గాల ద్వారా పార్టీ నేతల నుంచే నిధులు సమీకరిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసేవారి దగ్గర అప్లికేషన్ ఫీజులు వసూలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలోనూ అదే పద్దతి పాటిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు నేతలు పోటీ పడుతూంటారు. టిక్కెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేయడంతో అందరూ అప్లికేషన్లు  కొని.. దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వుడు కేటగరి సీట్లను మినహాయించినప్పటికీ.. పార్టీకి ఈ అప్లికేషన్ల ద్వారానే ఒకటి రెండు కోట్ల  వరకూ నిధులు లభిస్తాయన్న  అభిప్రాయం ఉంది. 


ఇప్పటికే తొలి జాబితా రెడీ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం                      


నిజానికి కాంగ్రెస్ లో అభ్యర్థుల కసరత్తు చాలా కాలంగా నడుస్తోంది. ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలన్న దానిపై పూర్తి స్థాయిలో ఓ నిర్ణయానికి వచ్చారని  చెబుతున్నారు. తొలి జాబితా సిద్ధమయిపోయిందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కేవలం ఫార్మాలిటీ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారని చెబుతున్నారు.  పలువురు నేతలకు టిక్కెట్లు హామీ ఇచ్చి ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. వారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.                  


సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే !  


కాంగ్గెస్ పార్టీ సీనియర్లు చాలా మంది తాము కూడా దరఖాస్తు చేసుకోవాలా అన్న మీమాంసలో ఉన్నారు. అయితే దరఖాస్తుకు వెల పెట్టింది.. టీ పీసీసీ కాదని.. హైకమాండేనని.. అందరూ డబ్బులు  పెట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు.