CM Jagan Security :  ఏపీ సీఎం జగన్ కు ఐసిస్, ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఆయనకు భద్రత కల్పించడం కోసం జడ్ ప్లస్ సెక్యూరి్టీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఏ ప్రాతిపదికన జగన్ కు .. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందో లేదో ఇంకా  క్లారిటీ లేదు. 


ప్రస్తుతం సీఎం జగన్ కు కమాండో భద్రత 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత భద్రత కు పటిష్టమైన యంత్రాంగం ఉంది.  ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళం అక్టోపస్‌ను సీఎం వైఎస్ జగన్‌ భద్రతలో భాగం చేశారు.  కౌంటర్‌ టెర్రరిజంలో ప్రత్యేకమైన శిక్షణ కలిగిన ఈ బలగాలు రక్షణ విధఉల్లో ఉన్నాయి.  సీఎం భద్రతలో ఉన్న ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ తోపాటు   అదనపు భద్రత కోసం ఆక్టోపస్‌ టీమ్‌ కూడా పనిచేస్తోంది. 30 మంది సభ్యులు గల ఆక్టోపస్‌ టీమ్‌ ప్రత్యేక బృందాలుగా విడిపోయి పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి నిర్ధేశించిన విధులును చేపడతారు. ఈ ఆక్టోపస్ బృందాలు సీఎం వెంట ఉండటంతోపాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంగా షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తారు.             


ఎవరెవరికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలో నిర్ణయించేది కేంద్ర హోశాఖ 


కేంద్రానికి అత్యున్నత స్థాయి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి.. దేశంలో ఎవరికి ముప్పు ఉంది..   అని వారు ఎప్పటికప్పుడు అసెస్‌మెంట్ చేస్తూనే ఉంటారు. వారికి ఉన్న నివేదికల్ని బట్టి భద్రత కల్పిస్తారు.  ఏపీ ఇంటలిజెన్స్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అత్యున్నత స్థాయి ముప్పు ఉందని నివేదికలు ఉంటేనే జడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు. సీఎంలలో యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ లకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఇతర బీజేపీ సీఎంలకూ కల్పించలేదు.                                         
 
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ 
 
ప్రస్తుతం ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది.  గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా..  చంద్రబాబు పర్యటనల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతూండటంతో అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇప్పుడు  డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత కల్పిస్తున్నారు.