Drunk and Drive: 


గుడ్‌గావ్‌లో ఘటన..


తప్పతాగి కార్లు, బైక్‌లు నడపకండి అంటూ పోలీసులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కొందరి తీరు మారడం లేదు. పైగా...తాగడంతో ఆపకుండా రోడ్లపై పిచ్చి చేష్టలు చేస్తూ నానా రచ్చ సృష్టిస్తున్నారు. మిగతా వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. మధ్యరాత్రి ఈ అల్లర్లు మరీ ఎక్కువైపోతున్నాయి. గుడ్‌గావ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి యువకులు నానా హంగామా చేశారు. పీకలదాకా తాగడమే కాకుండా..కార్ రూఫ్‌పై పుషప్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఆ యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.6,500 జరిమానా కూడా విధించారు. గుడ్‌గావ్‌లోని సైబర్ హబ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆల్టో కార్‌ కిటికీలో నుంచి బయటకు వచ్చి మెల్లగా కార్‌ రూఫ్‌ ఎక్కాడు. ఆ తరవాత చేతిలో మందు సీసా పట్టుకుని తాగాడు. వెంటనే బాటిల్ పక్కన పెట్టి అక్కడే పుషప్స్ చేశాడు. మిగతా వాళ్లు కూడా తాగుతూ కనిపించారు. వెనకాల మరో కార్‌లో వస్తున్న వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వైరల్ అయ్యాక పోలీసులు అప్రమత్తమై కార్ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...కార్‌లోని మిగతా వ్యక్తులనూ గాలిస్తున్నారు. ఆ కార్‌ని సీజ్ చేశారు. నిందితుడు..తన కజిన్ నుంచి లోన్ పెట్టి మరీ కార్ కొన్నాడు. ఇలా అడ్డదిడ్డంగా పార్టీ చేసుకుని బుక్ అయిపోయారు. మద్యం సేవించి ఇలా రోడ్లపై పిచ్చి వేషాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.