AP SSC Paper Leakage : ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణ ప్రభుత్వానికి కత్తిమీదసాముగా మారింది. రోజు ఏదో చోట పేపర్ లీక్ అయిందన్న వార్తలు వస్తున్నాయి. మాల్ ప్రాక్టీస్ కోసం కొందరు అడ్డదారుల్లో పేపర్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ పేపర్లు కాస్త మీడియా కంట్లో పడడంతో వార్తలు హీట్ ఎక్కుతున్నాయి. గత మూడు రోజులుగా ఇదే వ్యవహారం. తెలుగు పేపర్ తో మొదలు ఇవాళ్టి ఇంగ్లీష్ పేపర్ వరకూ లీక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం అంటోంది. లీక్ అయిందని సమాచారం వచ్చిన చోట్ల అధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. కొందరు ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను అరెస్టు చేసింది. 


ఇంగ్లీష్ పేపర్ లీక్? 


ఏపీలో పదో తరగతి పరీక్షల్లో లీకుల పర్వం కొనసాగుతోంది. నంద్యాల జిల్లాలో 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ పరీక్ష పూర్తి కాకముందే వాట్సప్ గ్రూప్ ల్లో చక్కర్లు కొట్టింది. పరీక్ష కేంద్రంలోని ఆరుబయట ప్రదేశంలో ఇంగ్లీష్ పేపర్ ఫొటోస్ తీసి వాటిని వాట్సప్ లో పంపారు. నందికొట్కూరులోని గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి పేపర్ ఫొటోస్ వచ్చినట్లు తెలుస్తోంది. గాంధీ మెమోరియల్ హై స్కూల్ అటెండర్ ద్వారా ఇంగ్లీష్ పేపర్ బయటకు వచ్చినట్లు సమాచారం. 


సోషల్ మీడియాలో పేపర్ 


పదో తరగతి పరీక్షల్లో శుక్రవారం ఇంగ్లీష్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఇంగ్లిష్‌ పేపర్‌ లీకైనట్లు వార్తలు వచ్చాయి. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంకా స్పందించలేదు. అయితే పదో తరగతి పరీక్షలు మొదటి రోజు తెలుగు పేపర్ లీక్ అయింది. సోషల్ మీడియాలో పేపర్ ప్రత్యక్షమైంది. రెండోరోజు హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిందన్న వార్తలు వచ్చాయి. దీనిపై స్థానిక అధికారులు మాత్రం తమ వద్ద లీక్‌ కాలేదంటూ వివరణలు ఇచ్చారు. 


ప్రభుత్వం సీరియస్ 


పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ పై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ లీకేజి వెనుక ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పేపర్ లీక్ వెనక ఓ ప్రైవేట్ స్కూల్ హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రమేయం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ స్కూల్ లో పనిచేస్తున్న తెలుగు టీచర్ లక్ష్మీ దుర్గ అరెస్ట్ తో ఇప్పటి వరకూ నిందితుల సంఖ్య 12కు పెరిగింది. ఇప్పటి వరకు అరెస్టై వారిలో ఏడుగురు తెలుగు టీచర్లు, ఇద్దరు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని డీఐజీ వెల్లడించారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె హై స్కూల్, కొలిమిగుండ్ల పరిధిలోని హై స్కూల్ విద్యార్థులందరినీ పాస్ చేయించాలనే ఉద్దేశంతోనే ప్రశ్నాపత్రాలు లీకేజికి పాల్పడినట్లు తెలుస్తోంది.