ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ప్రత్యేక హోదా(Special Status) రాజకీయం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ(Ysrcp) వైఫల్యం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదాపై మళ్లీ చర్చ మొదలవడానికి కారణం కేంద్ర హోంశాఖ.. శనివారం తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ చర్చల అజెండాను సిద్ధం చేసింది. ఇందులో ప్రత్యేక హోదా అంశాన్ని జోడించింది. దీంతో సీఎం జగన్(CM Jagan) కృషి ఫలించిందని ప్రభుత్వ పెద్దలు అన్నారు. ఇంతలో అజెండాలోని అంశాలు మారిపోయాయి. శనివారం సాయంత్రానికి అజెండాలో ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటకు వచ్చింది. టీడీపీ(Tdp) నేతల కుట్రలతోనే ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం : మంత్రి బొత్స


ఏపీ ప్రత్యేకహోదాపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. విజయనగరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం ఉందన్న మంత్రి.. సీఎం జగన్‌ కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని చాలాసార్లు తీసుకెళ్లారన్నారు. మూడు రాజధానులపై ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన అవి ఏర్పాటుచేసి తీరుతామన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి బొత్స మరోసారి తేల్చిచెప్పారు. 


వైసీపీ ప్రభుత్వం మరోసారి మోసం : పయ్యావుల కేశవ్ 


ప్రత్యేక హోదాపై వైసీపీ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Payyavula Kesav) ఆరోపించారు. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ జనవరిలో ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడా లేదని విమర్శించారు. అసలు హోదా గురించి అడగకుండా హోదా సాధించేసినట్లు వైసీపీ నేతలు హడావిడి చేశారన్నారు. అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మె్ల్యే పయ్యావుల మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రత్యేక హోదాపై అంశాన్ని కనీసం అజెండాలో పెట్టలేదని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. సీఎం జగన్ మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం వల్లే ప్రత్యేక హోదా విషయాన్ని అజెండా నుంచి తొలగించారని వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని పయ్యావుల మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందన్న జగన్... ఇప్పుడు వైసీపీ ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించడంలేదని ప్రశ్నించారు.