Tammineni Sitaram: అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్రలో అన్నదాతల కంటే డ్రామా ఆర్టిస్టులే ఎక్కువ మంది ఉన్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రైతుల పేరుతో బినామీ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలి రోజు నుంచీ చెప్తున్నామన్నారు. ముసుగు వీరులు ఎవరో శాసన సభలోనే చెప్పామని వివరించారు. పాదయాత్రలో వెరిఫికేషన్ చేస్తే.. కేవలం 70 శాతం మంది మాత్రమే అసలు రైతులు అని.. మిగిలిన దొంగ రైతులు పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. ఆ 30 శాతం మంది డ్రామా ఆర్టిస్టుల వల్లే అమరావతి ఉద్యమం కలుషితం అయిందని తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో కేవలం 70 మందే ఐడెంటిటీ కార్డులు పట్టుకుని వచ్చారంటే ఏమనాలని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. ఇది డ్రామా కాదా అని.. ఎవడి డ్రామా అని నిలదీశారు. ఆడీ కార్డులు చూపమంటే కల్యాణం మండపం నుంచి బయటకు రాలేదని.. చంద్రబాబు ఒక హిడెన్ అజెండాతో ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు.
అమరావతిలో అన్ సైడర్ ట్రేడింగ్ కచ్చితంగా జరిగింది. విశాఖ ప్రపంచ నగరం అని.. అమరావతిలా గ్రాఫిక్స్ కాదన్నారు.రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయన్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం అని అంటున్నారని... పోలీ అమరావతి కట్టారా అంటే గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని దుయ్యబట్టారు. శివరామకృష్ణ రిపోర్టు, శ్రీభాగ్ ఒఫ్పందాలను బుట్ట ధాఖలు చేశారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతం రజధానికి పనికిరాదని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని స్పీకర్ తమ్మినేని సీతారం గుర్తు చేశారు. శివరామకృష్ణ కమిటీ.. సీఎం జగన్ రెడ్డి వేసిన కమిటీ కాదని కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ అన్నారు. బ్యాంకులు దోచిన వారిని, విద్యను వ్యాపారం చేసిన వారిని చంద్రబాబు కమిటీలో వేశారని తమ్మినేని చురకలంటించారు.
వెనకబాటుతనాన్ని పారదోలేందుకే ఉత్తరాంధ్రకు రాజధాని అని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర పోరాటంలో నాడు ఎందరో మేధావులు త్యాగాలు చేశారని.. నాడు ఎందరో మహానేతలు చేసిన ప్రాణ త్యాగాలకు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయాలనుకుంటున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నాడు భూస్వామ్య వ్యవస్థపై తిరగబడిందే సిక్కోలు సాయుధ పోరాటం అని గుర్తు చేశారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు తోడ్పడాలని, న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కోరుతున్నట్లు చెప్పారు.
రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు పవన్ కల్యాణ్ కు లేవని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఓ నాయకుడు చెప్పు చేత పట్టుకుని పళ్లు రాలగొడతానని చప్పడం దారుణం అన్నారు. అలాగే మంత్రులపై జరిగిన దాడి అవాంఛనీయ సంఘటనగా అభివర్ణించారు. ఆ దాడిని పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదన్నారు. విమర్శ, ప్రతివిమర్శతోనే ఏ వివాదమైనా సద్దుమణిగిపోవాలి కానీ ఇలాంటి దాడులు సరికావు అని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర ఆకాంక్ష వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించడమేనన్నారు స్పీకర్ తమ్మినేని. అలాంటి కోరికతో పెద్ద ఎత్తున సభ జరిగితే..దానిని వ్యతిరేకంగా జరిగిన దాడిగా ఈ ఘటనను చూస్తున్నామన్నారాయన. మంత్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి దాడులు చేస్తే..మరింత తీవ్రంగా ప్రతి దాడి జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే అందరూ సంయమనం పాటించాలని కోరారు.