Speaker Tammineni Seetharam : ఏపీ కొత్త కేబినెట్ లో సామాజిక న్యాయం జరిగిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు.  మంత్రి వర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. సీఎం జగన్‌ మానవతావాది అని తమ్మినేని అన్నారు. అణగారిన వర్గాలకు సీఎం జగన్‌ ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు. బీసీలకు దామాషా పద్దతిలో రాజాధికారం కల్పించారని తెలిపారు. వైసీపీ సర్కార్ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్దిదారుల ఇంటికే చేరుస్తుందన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన ఆయన, బీసీలు ఆ పార్టీకి ఎప్పుడో దూరమైపోయారన్నారు. 



కేబినెట్ లో బీసీలకు పెద్దపీట 


సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పనిచేస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సీఎం ఎక్కడ ఉండమంటే అక్కడుంటానన్నారు. కేబినెట్ కూర్పు అంత సులువేంకాదన్న ఆయన, అది సీఎం విచక్షణాధికారమన్నారు. కేబినెట్‌లో ఉండాలని తనను అందరూ అడిగారన్నారు. మంత్రి పదవి అశించడంలో తప్పులేదుగా అని తమ్మినేని అన్నారు. ఏపీలో అద్భుతమైన కేబినెట్ వస్తుందన్నారు. దామాషా పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేబినెట్ సముచిత స్థానం కల్పించారన్నారు. సీఎం జగన్ మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు. 133 కార్పొరేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 


ఈసారి డిపాజిట్లు రాకుండా పోతారు 


సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పక్షపాతి అని మరోసారి రుజువైందని స్పీకర్ తమ్మినేని అన్నారు. జగన్ ఒక గొప్ప మానవతావాదిగా మరోసారి నిరూపించుకున్నారన్నారు. జగన్‌ గురించి తప్పుగా మాట్లాడుతున్న మాజీమంత్రులు చర్చకు వస్తారా అని స్పీకర్ తమ్మినేని సవాల్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చాయో అచ్చెన్నాయుడు చూసుకోవాలని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వానికి చెప్పడానికి యనమల ఎవరని ప్రశ్నించారు. కళింగ కమ్యూనిటీ నుంచి స్పీకర్ గా ఉన్నానని, అది చాలన్నారు. మంత్రి పదవులపై సహజంగానే ఆశావహులు ఉంటారన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమం వచ్చిందన్నారు. ఈ సామాజిక న్యాయ విప్లవంతో ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు లేకుండా పోతాయని జోస్యం చెప్పారు. 


Also Read : Pawan Kalyan : లక్ష ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్లిపోను - కౌలు రైతుల బిడ్డల కోసం ప్రత్యేక నిధి : పవన్ కల్యాణ్