AP Rains : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి కూడా భారీ వరద రావడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలోకి వరద నీరు చేరింది. గోదావరి వరదతో మెట్లపైకి నీరు చేరుతోంది. ఎగువ నుంచి వరదనీరు గోదావరిలోకి భారీగా చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. వరద నీటిని భారీగా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటాలని అధికారులు సూచిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 1800 425 0101, 0863 2377118 ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి ఉద్ధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరికి ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై నెలలో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ధవళేశ్వరంలో వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయానికి వరద మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. వరదల ఉద్ధృతి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదలు కొనసాగే అవకాశం ఉందన్నారు.
తక్షణసాయం విడుదల
అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక శిబిరాలు తెరవాలని సీఎం జగన్ ఆదేశించారు. కూనవరం, చింతూరులో రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, వి.ఆర్.పురం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి మంచి నీరు, ఇతర సౌకర్యాల సిద్ధంగా ఉంచాలన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు సాయం అందించాలన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోట్లు, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున తక్షణ నిధులు జారీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.