AP Power Cuts : ఏపీలో కరెంట్ కోతలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి అప్రకటిత కోతలు అమలుచేస్తున్నారు. డిమాండ్ కు తగిన సరఫరా అందుబాటులో లేకపోవడంతో కరెంట్ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయాల్లో కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పరీక్షల సమయంలో కోతలు విధించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
రెండు వారాల పాటు పవర్ హాలిడే
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నామని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్ మాత్రమే వాడుకోవాలని సూచించారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వీక్లీ హాలిడేకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడే పాటించాలని పరిశ్రమలను యాజమాన్యాలకు సీఎండీ కోరారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల పాటు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలులో ఉంటుందని హరనాథరావు వివరించారు.
విద్యుత్ డిమాండ్ అధికమై
పరిశ్రమలకు 50 శాతం కోత విధిస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఒక రోజు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అంటే పవర్ హాలిడే ప్రకటిస్తామని పేర్కొన్నారు. రెండు వారాల పాటు విద్యుత్ కోత అమల్లో ఉంటుందని అధికారుల తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన 235 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్ నుంచి 64 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొ్న్నారు. గత రెండేళ్లతో పాటు పోలిస్తే విద్యుత్ డిమాండ్ మరింత పెరిగిందని అంటున్నారు. కోవిడ్ తరవాత అనేక పరిశ్రమలు పనిచేయడం ప్రారంభించాయన్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోందని ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిటక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.
పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన
ఏపీని విద్యుత్ సంక్షోభం చుట్టుముడుతున్నట్లుగా కనిపిస్తోంది. విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో కరెంట్ కోతల కారణంగా ఎదిగి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు కంట తడి పెట్టుకుంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో ఐదు రోజులుగా విద్యుత్ కోతల కారణంగా ఆరుగాలం శ్రమించి కాపాడుకున్న పంట వాడిపోతోంది. దీంతో తట్టుకోలేక కరెంటు ఆఫీస్ కు చేరుకొని ఓ రైతు గుండెలవిసేలా ఏడ్చాడు. ఆ పక్కనే ఉన్న రైతులు నీళ్ళిచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. చచ్చిపోయినా బాగుండునని ఆ రైతు ఏడవడం రాయలసీమలోని పలు ప్రాంతాల రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. పొలాలలో బోరుబావులు ఉన్నప్పటికీ నీటిని తోడడానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటికేడాది అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్యల బాట పడుతున్నారు అన్నదాతలు.
Also Read : AP Power Crisis : ఏపీ రైతులకు కరెంట్ గండం - కోతలతో ఎండిపోతున్న పంటలు !