AP Cabinet Decissions : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై మంత్రి వర్గం సమావేశంలో చర్చించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. నవరత్నాలు అమల్లో భాగంగా సున్నా వడ్డీ పథకాన్ని మూడో ఏడాది కూడా కొనసాగించేందుకు రూ.1,259 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 7 మండలాలలతో, పులివెందులలో 8 మండలాలతో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.



12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్లు ఏర్పాటు


కొత్త జిల్లాలో ఏర్పాటులో భాగంగా 12 పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్లు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లా పరిషత్‌ల కాలపరిమితి, రిజర్వేషన్లు కొనసాగిస్తూ మంత్రి వర్గం తీర్మానించింది. చిత్తూరు జిల్లా పుంగనూరులోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది. చిరు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ మిల్లెట్ మిషన్‌ పాలసీని 2022-23 నుంచి 2026-27 వరకు మంత్రి వర్గం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఒక అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్‌ లను మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 



ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం 


ఉన్నత విద్యాశాఖలో 253 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 23 ప్రిన్సిపల్‌, 31 టీచింగ్‌ పోస్టులు, 139 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉండనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో 82 ఎకరాలు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు కోసం 84 ఎకరాల కేటాయించింది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్‌, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 


కేబినెట్ భేటీ నిర్ణయాలు వెల్లడిస్తూ మంత్రి పేర్ని నాని ఉద్వేగానికి లోనయ్యారు. మంత్రిగా చివరి ప్రెస్ మీట్ కావడంతో ఆయన కొంత ఉద్విగ్నంగా మాట్లాడారు. మంత్రిగా తన అనుభవాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.