Remand Report On Attack On Cm Jagan: సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న నిందితుడు సతీష్ ను గురువారం విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా సతీష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అతని ఫోన్ కూడా సీజ్ చేశామన్నారు. సీఎం జగన్ ను అంతమొందించాలనే ఉద్దేశంతోనే దాడి చేసినట్లు తెలిపారు. అదును చూసి సున్నితమైన తల భాగంలోనే కుట్ర ప్రకారం రాయితో దాడి చేసినట్లు చెప్పారు. 


రిమాండ్ రిపోర్ట్ లో ఏముందంటే.?


'సీఎం జగన్ కు ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడు. డాబా కోట్ల సెంటర్ లో దాడి చేసేందుకు యత్నించాడు. వివేకానంద స్కూల్ పక్కన ఉన్న బెంచ్ దగ్గరకు వెళ్లి సతీష్ రాయితో దాడి చేశాడు. అక్కడ తోపులాట ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కేసులో ఏ2 ప్రోద్బలంతోనే సతీష్ దాడి చేశాడు.' అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు.


అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు.. ఆధార్ లో తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితుడి ఆధార్ కార్డులో పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అతను నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని.. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని వాదించారు. కాగా, దురుద్దేశపూర్వకంగానే నిందితుడు సీఎంపై రాయితో దాడి చేశాడని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. మున్సిపల్ అధికారుల ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. సతీష్ కు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


కాగా, విజయవాడలో ఈ నెల 13న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర చేస్తుండగా.. సీఎం జగన్ పై సింగ్ నగర్ వద్ద రాయి దాడి జరిగింది. దీనిపై విచారించేందుకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు.. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సతీష్ అనే యువకుడే సీఎం జగన్ పై రాయి దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. అటు, సీఎంపై రాయి దాడి ఘటన రాజకీయంగానూ హీట్ పెంచింది. ఇది ఆకతాయిల పని కాదని.. పక్కా ప్రణాళికతో చేసిందే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుండగా.. టీడీపీ నేతలు దీనిపై కౌంటర్ ఇస్తున్నారు.


Also Read: AP Advisors Politics : రాజకీయాలు చేయాలంటే రాజీనామా చేయాల్సిందే - వైసీపీకి సలహాదారుల సమస్య !