Ap Police Custody Petition On Accused In Attack on Cm Jagan: ఏపీ సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుట్రకోణంపై నిందితున్ని మరింత లోతుగా విచారించాల్సిన ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును కోరారు. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు, నిందితుడి వాంగ్మూలాన్ని 164 సీఆర్పీసీ కింద నమోదు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్.. సోమవారం నాలుగో ఏసీఎంఎం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తీవ్రత, తదుపరి దర్యాప్తు దృష్ట్యా సతీష్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని పిటిషన్ లో కోరారు. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు నిందితుడి తరఫు న్యాయవాది సలీం సమయం కోరగా.. స్పందించిన న్యాయాధికారి రామ్మోహన్ విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.


ఇటీవలే దుర్గారావు విడుదల


మరోవైపు, ఈ కేసులో అనుమానితుడిగా భావించిన దుర్గారావు అనే టీడీపీ నాయకున్ని పోలీసులు ఇటీవలే విడిచిపెట్టారు. 4 రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నా.. అతన్ని బయటకు కనిపించకుండా చేశారని కుటుంబ సభ్యులు వాపోయారు. అటు, దుర్గారావు తరఫు లాయర్ సలీం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కోసం యత్నిస్తుండగా.. కుటుంబ సభ్యులు, వడ్డెర కాలనీవాసులు విజయవాడ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చివరకు ఈ నెల 20న శనివారం రాత్రి విజయవాడ నార్త్‌ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి.. మళ్లీ అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి అందరి నుంచి సంతకాలు తీసుకున్నారు. ఏప్రిల్16న తనను పోలీసులు అరెస్టు చేశారని.. సీఎం జగన్‌పై దాడి ఎందుకు‌ చేయించావని పోలీసులు తనను ప్రశ్నించారని దుర్గారావు చెప్పారు. ఆ ఘటనతో తనకు ఏ సంబంధం‌ లేదని చెప్పినా పోలీసులు వినడం లేదని అన్నారు. నిందితుడైన సతీష్ తన పేరు చెప్పాడని.. అందుకే పిలిచి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సతీష్ తన పేరు ఎందుకు చెప్పాడో తనకు తెలియదని దుర్గారావు తెలిపారు.


కాగా, ఈ నెల 13న సీఎం జగన్ విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా రాయి దాడి జరిగింది. సీపీ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయగా.. ప్రధాన నిందితుడు సతీష్ గా పోలీసులు గుర్తించారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించింది. అటు, ఈ ఘటనకు సంబంధించి అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సైతం జోరందుకున్నాయి. టీడీపీ నేతలపై వైసీపీ విమర్శలు చేస్తుండగా.. ఇది ఎన్నికల డ్రామా అంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. 


Also Read: Andhra Pradesh: తిరుమలలో ట్యాక్సీలు తిరగాలంటే కమీషన్ కట్టాల్సిందే! డ్రైవర్ల సమస్యకు పరిష్కారం దొరికేనా!