Andhra Pardesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు చేపడుతూ నిరసన తెలియచేస్తున్నారు. ఐ యామ్ విత్ బాబు పేరుతో  ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాలు చేపడుతున్నారు. పలుచోట్ల తెలుగు తమ్ముళ్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. దీంతో పోలీసులు ఆందోళనలను అడ్డుకుంటున్నారు.


టీడీపీ శ్రేణుల నిరసనలకు సంబంధించి తాజాగా ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ముందుగా అనుమతి తీసుకుని, ఆ తర్వాతే నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అనుమతి లేని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనుమతి లేని ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని సూచిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసులు నమోదైతే యువతకు ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని హెచ్చరించారు.


నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కేసు నమోదైతే విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కూడా రాదని సూచించారు. అనుమతి లేకుండా ఆందోళనల్లో పాల్గొనేవారికి నోటీసులు జారీ చేస్తామని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. యువత ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో అనధికార మెస్సేజ్‌లు వ్యాప్తి చెందుతుండటంపై పోలీసులు సీరియస్ అయ్యారు. తప్పుడు వార్తలను ఎవరూ దుష్ప్రచారం చేయవద్దని సూచించారు.


జనసేన నేతలు కూడా మద్దతు


టీడీపీ చేస్తున్న నిరసనలకు జనసేన నేతలు కూడా మద్దతు ఇస్తున్నారు. టీడీపీ ఆందోళనల్లో జనసేన నేతలు పాల్గోని మద్దతు ప్రకటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని, వాటిల్లో పాల్గొనాలని జనసైనికులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఆ పార్టీకి అండగా ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పవన్ ములాఖాత్ అయ్యారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని, జగన్‌ను ఓడించడానికి ఆ పార్టీతో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా శనివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కూడా టీడీపీతో పొత్తుపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ నేతలను కించపర్చేలా మాట్లాడవద్దని సూచనలు చేశారు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదని, అందరూ ఒక్కటేనని అన్నారు. టీడీపీ 40 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ అని, ఆ పార్టీకి ప్రజల్లో బలం ఉందన్నారు. టీడీపీని ఎవరూ తక్కువ అంచనా వేసి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టవద్దని జనసైనికులకు పవన్ సూచించారు. పవన్ ప్రకటనతో టీడీపీ నేతల ఆందోళనల్లో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అంతేాకాకుండా టీడీపీతో సమన్వయం చేసుకునేందుకు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఒక కమిటీని కూడా పవన్ ఏర్పాటు చేశారు.