సీఎం జగన్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్లు అమాయకులను బురిడీకొట్టిస్తూ అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని డీజీపీ అన్నారు. లాటరీ మెయిల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు, సెల్ ఫోన్ల లావాదేవీలపై కన్ను, భద్రతా పరమైన నేరాలపై గోప్యత, OTP మోసాలు, కోవిడ్ టీకా సంబంధిత మోసాలు, ఆధార్ అనుసంధానం, బీమా సంస్థల పేరుతో మోసాలు, ప్రభుత్వ పథకాల పేర్లతో మోసాలు, బిట్ కాయిన్ మోసాలు, మహిళల పట్ల అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు, మర్ఫెడ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వంటి అనేక నేరాలకు పాల్పడుతున్నారని డీజీపీ అన్నారు. 



Also Read: హరిత పన్ను రూ.200 నుంచి రూ.20 వేలకు పెంపు... సర్కారు నిర్ణయంపై లారీ యజమానుల ఆందోళన... సీఎం జగన్ కు లేఖ


20 వేల మందికి ఆన్ లైన్ లో శిక్షణ 


ఈ మోసాలను  నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ను త్వరలోనే  ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ సవాంగ్ అన్నారు. వీటికి ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్, లాప్ టాప్, హై ఎండ్ కంప్యూటర్ వంటి ఆధునిక హార్డ్ వేర్ ను అందిస్తామన్నారు. ఈ ల్యాబ్స్ లో విధులు నిర్వహించేందుకు బి.టెక్ విద్యార్హత కలిగిన ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. త్వరలోనే ప్రతి జిల్లాకు సాంకేతిక పరంగా న్యాయ సలహాల కోసం సైబర్ లీగల్ అడ్వైజర్, సైబర్ నిపుణుల నియమకాన్ని చేపడతామన్నారు. మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. మొదటి విడతలో విజయనగరంలో 100 , ఒంగోలులో 100, అనంతపురంలో 100 మందికి శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 20,000 మందిని ఎంపిక చేసి విడతలవారీగా  సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా నేరాల నియంత్రణపై  శిక్షణ ఇస్తామని డీజీపీ అన్నారు. 


Also Read: విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం... తరగతుల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు కీలక వ్యాఖ్యలు


సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక నిఘా


ఈ శిక్షణ  కార్యక్రమంలో సిబ్బందితో పాటు రాష్ట్రంలోని డీఎస్పీలు,  అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలు పాల్గొంటారని డీజీపీ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో  సైబర్ సెల్,  సోషల్ మీడియా ల్యాబ్ లు  ఏర్పాటు చేయడం ద్వారా సైబర్ నేరాలుపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు. జిల్లా స్థాయిలోని సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ను అనుసంధానం చేస్తూ రాష్ట్ర స్థాయిలో సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్ ద్వారా జిల్లా స్థాయి సిబ్బందికి  నిపుణులు చేత సూచనలు సలహాలను అందిస్తూ కేసు దర్యాప్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపుతామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 1551 మంది ప్రొఫైల్ లను గుర్తించి వారందరి పైనా సైబర్ బుల్లి షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు ప్రతి క్షణం వారి కదలికల పైనా నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.


Also Read: ఏపీలో కరోనా విజృంభణ... కొత్తగా 4108 కోవిడ్ కేసులు... 30 వేలు దాటిన యాక్టివ్ కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి