రాష్ట్రంలో హ‌రిత ప‌న్నును ఏపీ స‌ర్కారు రూ.20 వేల‌కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లారీ య‌జ‌మానులు బెంబేలెత్తిపోతున్నారు. లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ హాల్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యద‌ర్శి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నేప‌థ్యంలో ర‌వాణా ప‌రిశ్రమ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంద‌న్నారు. మార్కెట్ ఆర్థిక మంద‌గ‌మ‌నంతో రోజువారి ఖ‌ర్చులు కూడా పెట్టలేని ప‌రిస్థితి ఏర్పడింద‌ని తెలిపారు. కిస్తీలు క‌ట్టక‌పోవ‌డంతో ఫైనాన్స్ కంపెనీలు లారీల‌ను తీసుకువెళ్లిపోతుండ‌డంతో లారీ య‌జ‌మానులు, క్లీనర్లు ప‌నులు లేక అల్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి 200 రూపాయ‌లు ఉన్న గ్రీన్ టాక్స్‌ను కేట‌గిరీల వారీగా 20 వేల రూపాయ‌ల వ‌ర‌కు పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ ప్రతిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డికి లేఖ రాసి ర‌వాణాశాఖ మంత్రి పేర్ని నానికి అంద‌జేశామ‌ని వివ‌రించారు. దీనికితోడు రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితి అధ్వానంగా ఉండ‌డంతో నిర్వహ‌ణ వ్యయం అధిక‌మ‌వుతుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మ‌ర‌మ్మతులకు త‌క్షణ చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ త‌గ్గించాల‌ని దీనివ‌ల్ల ప్రభుత్వ ఆదాయం త‌గ్గద‌ని మంత్రికి తెలియ‌జేశామ‌ని ఈశ్వర‌రావు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. 


Also Read: విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం... తరగతుల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు కీలక వ్యాఖ్యలు


హరితపన్ను వసూలు నిలిపివేయండి


కోవిడ్‌తో నష్టాల్లో ఉన్న సమయంలో హరితపన్ను పెంచడం సరికాదని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఎం జగన్‌కు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ లేఖ రాసింది. కోవిడ్‌ కారణంగా రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర మందగమనం వల్ల రోజు వారీ ఖర్చులకు కూడా కష్టమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరితపన్ను భారీగా పెంచిందని ఆవేదన చెందుతున్నారు. హరిత పన్ను రూ.200 నుంచి రూ.20 వేల వరకు పెంచడం లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హరితపన్ను వసూలును నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరిహద్దు రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉన్నాయని లారీ యజమానులు లేఖలో తెలిపారు. 


Also Read: ఏపీలో కరోనా విజృంభణ... కొత్తగా 4108 కోవిడ్ కేసులు... 30 వేలు దాటిన యాక్టివ్ కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి