AP Sarpanch Elections : ఏపీలో 35 గ్రామ సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అనంతరం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. చిన్న పంచాయతీల ఉపఎన్నికలే అయినా రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పింది.
అనంతపురం జిల్లా నార్పలలో ఎనిమిదవ వార్డు ఉప ఎన్నికలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పోరు సాగుతోంది. ఒక వార్డ్ పోలింగుకు డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ అస్సార్ భాష, రాప్తాడు, నార్పల ఎస్సైలు, మరో 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎనిమిదవ వార్డులో మధ్యాహ్నం ఒంటి గంటకి పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత రెండు గంటల నుంచి వార్డు కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు.. టీటీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తమపై దాడులు చేయిస్తున్నారని తెలుగు దేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వణుదుర్రు పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు ఆధ్వర్యంలో రిగ్గింగ్ జరుగుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సర్పంచి ఉపఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడుగురు టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండపి ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసిపి ఇన్‌ఛార్జిని వదిలి తమను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బప్పడంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
ఓటమి భయంతో సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమా ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండచూసుకునే వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారన్నారు. అధికార పార్టీ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఒక రూలు - ప్రతిపక్షానికి ఒక రూలా అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పారిపోవడం ఖాయమన్నారు. వీరమ్మకుంటలో చోటుచేసుకున్న ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించాలని కోరారు. దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.