Agrigold Protest  : అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం  ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడకిక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి  ఏపీ నలుమూలల నుంచి విజయవాడకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల  సంఘం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైళ్లలో వస్తున్న వారిని స్టేషన్‌లోనే అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.  అగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్ల సంఘం నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కోరాడ రాంబాబు, షరీఫ్‌ తదితరులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని జింఖానా మైదానంలో శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 


అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇస్తామని జగన్ హామీ


అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు ఇస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలనూ పెట్టారు.  ప్రభుత్వం ప్రకటించిన మొదటి బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు కేటాయించారు కానీ రూపాయి కూడా విడుదల చేయలేదు. తర్వాత  బడ్దెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు . కానీ ఖర్చు చేయలేదు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి కేటాయింపులు లేవు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే చర్యలను ప్రభుత్వం నిలిపివేసిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ ఎన్నికలు వస్తున్నా సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. 


దాదాపుగా 20 లక్షల మంది బాధితులు 


అగ్రిగోల్డ్‌లో రాష్ట్రానికి చెందిన 19.52 లక్షల మంది డిపాజిట్‌లు, పెట్టుబడులు పెట్టగా, దేశంలోని ఏడు రాష్ట్రాలలో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బాధితులకు న్యాయం చేస్తామని గత టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి సర్కార్‌ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అయినప్పటికీ బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. బాధితులకు రూ.3,964 కోట్లను చెల్లించాలని  సిఐడి  తేల్చింది. అగ్రిగోల్డ్‌ సంస్థ 2015 జనవరిలో బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు, ఏజెంట్లు గుండెపోటుతో ఇప్పటి వరకు 300 మందిపైనే మృతి చెందారు. వారిలో 144 మందికి గత ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. తాము వస్తే రూ. పది లక్షలు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ  నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. 


ఇప్పటి వరకు రూ. 964 కోట్లు చెప్పింపు                           


మొత్తం బాధితులలో రూ.20 వేలలోపు డిపాజిట్‌లున్న వారు 10 లక్షల మంది ఉన్నారని అంచనా వేయగా, వారిలో ఆరు లక్షల మందికి ప్రభుత్వం రూ.964 కోట్లను చెల్లించింది. మిగిలిన వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాలేదు. వీరిలో ఒక్కొక్కరికి రెండు మూడు బాండ్‌లు ఉన్నప్పటికీ ఒక్క బాండ్‌కే చెల్లింపు చేశారు. రూ.20 వేలపైబడి డిపాజిట్‌ చేసిన బాధితులు 13.52 లక్షల మంది ఉన్నారు.  అగ్రిగోల్డ్‌ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.35 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అప్పటి హోంమంత్రి   హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. ఇప్పటికే వాటన్నింటినీ కోర్టుకు అటాచ్‌ చేశారు. ఆస్తులను వేలం వేసి బాధితులందరికీ డిపాజిట్‌లను చెల్లిస్తామన్న గత, ప్రస్తుత ప్రభుత్వాల హామీలు నెరవేరడంలేదు