Financial situation of AP  :  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై లెక్కలు తీసేందుకు కొత్త చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ కుమార్ సమీక్ష నిర్వహించారు.  శనివారం సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి   ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ కూడా హాజరయ్యారు.   ఏపీ ఆర్థిక స్థితి గతులపై కీలకంగా చర్చ సాగింది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఏపీ ఆర్థిక పరిస్థితిని కేవీవీ సత్యనారాయణ సీక్రెట్ గా ఉంచారని ఆరోపణలు                                   


ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రం నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి సత్యనారాయణ మొత్తం ఆర్థిక శాఖను గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బిల్లుల చెల్లింపులు అన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచాయి. నిబంధనలు అన్ని ఉల్లంఘించి అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లించారని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా అదే చెబుతూ వస్తున్నారు. 


బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలపై   కాంట్రాక్టర్ల ఫిర్యాదు                               


 వైసీపీ ప్రభుత్వ హ యాంలో నిబంధనలను కాలరాసి, సొంత వారికోసం పాతిక వేల కోట్ల రూపాయల మేర అక్రమంగా బిల్లులు చెల్లించార ని, కమీషన్ల కోసం బడా సంస్థలకు చెల్లించారని, వీటిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఇంజనీరింగ్‌ కాంట్రాక్టర్లు శుక్రవారం విజిలెన్స్‌, ఏసీబీలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు కూడా ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. సీనియర్ అధికారులు‌ జవహర్‌రెడ్డి,  ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ లక్ష్మీశపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరారు.  చిన్న, మధ్య కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులురాక ఆర్థికంగా చితికిపోయారని పేర్కొన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారు ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లింది. 


కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం                          


అదే సమయంలో నిబంధనల ప్రకారం ఫిఫో పద్దతిలో బిల్లులు చెల్లించాల్సి ఉంది. అంటే మొదట వచ్చిన వారికి మొదట చెల్లింపు పద్దతి. ఇది పాటించకుండా మిగతా అన్ని శాఖల్లో కూడా కమిషన్లు ఇచ్చిన వారికి, అస్మదీయ కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున చెల్లింపులు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై ఆర్థికశాఖ నివేదిక ఖరారు చేసే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ రిలీవ్ చేయాలని కోరుతున్నా.. ఉన్నతాధికారులు అంగీకరించడం లేదు. మొత్తం లెక్కలు తేలిన తర్వాత రిలీవ్ చేస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.